కిరాణా షాపుల్లోనే కొనుగోలుకు ప్రజల ఆసక్తి

కిరాణా షాపుల్లోనే కొనుగోలుకు ప్రజల ఆసక్తి
  • పప్పులు, ఉప్పులు అక్కడే ఎక్కువగా కొంటున్నరు

    రిటైల్​ బిజినెస్​లో కిరాణా షాపుల వాటా 75% పైనే

    దేశంలో రిటైల్ మార్కెట్‌‌ వేగంగా విస్తరిస్తోంది. గ్లోబల్‌‌ కంపెనీలతో పోటీ పడుతూ ఇండియన్ కంపెనీలు కూడా తమ  బిజినెస్‌‌లను పెంచుతున్నాయి. సూపర్‌‌‌‌ మార్కెట్లు ఏర్పాటు పెరుగుతోంది. ఆన్‌‌లైన్‌‌లో రిటైల్ షాపింగ్‌‌ కూడా వేగంగా విస్తరిస్తోంది. అయినప్పటికీ ఇంకా కిరాణాలు, చిన్న చిన్న షాపుల్లోనే కొనుగోలు చేయడానికి కన్జూమర్లు  ఇష్టపడుతున్నారు.  రిటైల్ మార్కెట్‌‌లో వీటి వాటా ఏకంగా 70–75 శాతం వరకు ఉండడం విశేషం. కిందటేడాది ఇండియా రిటైల్ మార్కెట్ వాల్యూ 888 బిలియన్ డాలర్లుగా ఉందని ఫారెస్టర్‌‌‌‌ రీసెర్చ్ డేటా చెబుతోంది. ఇందులో గ్రోసరీ సెగ్మెంట్ వాటానే 608 బిలియన్‌‌ డాలర్లుగా ఉందని పేర్కొంది. 2024 నాటికి దేశ రిటైల్ మార్కెట్‌‌ విలువ 1.3 ట్రిలియన్‌‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనావేసింది. కాగా, గ్రోసరీ సెగ్మెంట్ కిందకు రోజువారి వాడే వస్తువులు, పప్పులు, ధాన్యాలు, మాంసం, నూనెలు వంటివి వస్తాయి. కరోనా వలన సూపర్ మార్కెట్ ట్రెండ్ పెరుగుతోందని, ఎక్కువగా జనాలుండే చిన్న లోకల్‌‌ స్టోర్ల కంటే వీటిలో షాపింగ్ చేయడానికి  కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని ఎనలిస్టులు అన్నారు. అంతేకాకుండా ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ పెరిగిందని అంటున్నారు.  ప్రస్తుతం దేశ జీడీపీలో రిటైల్ సెక్టార్ వాటా 10 శాతంగా ఉందని, దేశ ఎంప్లాయిమెంట్‌‌లో 8 శాతంగా ఉందని నేషనల్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్రమోషన్ సంస్థ ఇన్వెస్ట్‌‌ ఇండియా పేర్కొంది.

    కిరాణాలు, బడ్డి కొట్లదే హవా..

    దేశంలో కిరాణాలు, చిన్న షాపులు, బడ్డి కొట్లు వంటివి  క్లాత్స్‌‌, ఫుట్‌‌వేర్ నుంచి గ్రోసరీ ఐటెమ్స్‌‌, ఎలక్ట్రానిక్స్‌‌ వరకు అన్నీ అమ్ముతున్నాయి. కస్టమర్లు కూడా ఎక్కువగా కిరాణా, చిన్న షాపుల్లోనే గ్రోసరీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌‌లో  ఈ షాపుల వాటా 75–78 % వరకు ఉంటుందని ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీ అంబిత్ క్యాపిటల్‌‌ అంచనావేస్తోంది. ఇలాంటి  స్టోర్లకు రెగ్యులర్ కస్టమర్ల బేస్ ఎక్కువగా ఉంటోందని, చుట్టుపక్కల ఉండేవారు ఈ షాపుల దగ్గరకే వచ్చి కొనుగోలు చేస్తుంటారని తెలిపింది. కొన్ని షాపులయితే ఫోన్‌‌ల ద్వారా ఆర్డర్లు తీసుకొని, వస్తువులను డెలివరీ చేస్తున్నాయని పేర్కొంది. పప్పులు, రైస్‌, గోధుమ వంటి ప్రొడక్ట్‌‌లను విడిగా లేదా బ్రాండ్‌‌ ప్యాకెట్లతో ఈ షాపులు అమ్ముతుంటాయి.

    పెరుగుతున్న సూపర్ మార్కెట్స్‌‌..

    దేశంలో సూపర్ మార్కెట్‌‌ సెగ్మెంట్‌‌లో ముకేశ్‌‌ అంబానీ రిలయన్స్ రిటైల్‌‌, కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్‌‌‌‌ రిటైల్‌‌, రాధాకిషన్ దమానీకి చెందిన డీమార్ట్‌‌ స్టోర్లు పోటీ పడుతున్నాయి.  రిటైల్ మార్కెట్లో ఈ సెగ్మెంట్ వాటా 12–15% వరకు ఉంటుందని అంబిత్ క్యాపిటల్ అంచనావేసింది. కాగా, కిరాణాలు ఇరికురుగా ఉంటే, సూపర్ మార్కెట్లు విశాలంగా ఉంటాయి. వివిధ కేటగిరీకి చెందిన ప్రొడక్ట్‌‌లు విడిగా ఉంటాయి. ప్రస్తుతం సూపర్‌‌‌‌ మార్కెట్ల ట్రెండ్ పెరుగుతోంది. కొన్ని ఏరియాలలో మినీ సూపర్ మార్కెట్లు కూడా ఏర్పాటవుతున్నాయి. రోజువారీ రిటైల్ షాపింగ్‌‌ చేసేవాళ్లే వీటి మెయిన్‌ టార్గెట్‌.

    భవిష్యత్‌‌ ఆన్‌‌లైన్‌‌లోనేనా?

    ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ లేదా ఈ–కామర్స్‌‌ ట్రెండ్‌‌ ఈ మధ్య బాగా పెరుగుతోంది.  ప్రస్తుతం ఇండియన్ రిటైల్ మార్కెట్‌‌లో ఆన్‌‌లైన్ షాపింగ్ వాటా 5–6 శాతం వరకు ఉంటుందని అంచనా. 2019 లో ఆన్‌‌లైన్‌‌ రిటైల్ మార్కెట్ విలువ 30 బిలియన్‌‌ డాలర్లుగా ఉందని ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది.   2026 నాటికి ఈ విలువ 200 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని తెలిపింది.  ప్రస్తుతం ఇండియన్ ఈ–కామర్స్ మార్కెట్లో అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ వంటి కంపెనీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా యాప్‌‌ల సాయంతో  ప్రొడక్ట్స్‌‌ను ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నాయి.