
కరీంనగర్ : మార్కెట్ కమిటీల్లోనూ రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్ దే అన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ లోని గోపాల్ రావుపేటలో నూతనంగా ఎంపికైన మార్కెట్ పాలకవర్గానికి అభినందనలు తెలిపారు గంగుల. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..2001 నుంచి పనిచేసిన ఉద్యమకారులకు మార్కెట్ పాలకవర్గంలో చోటు దక్కడం సంతోషకరమన్నారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఒక్కటైనా.. ప్రజలు టీఆర్ఎస్ నే ఆశీర్వదించారు. రైతులను అన్ని విధాల ఆదుకున్నందుకే ప్రజలు హుజూర్ నగర్ ను గిఫ్టుగా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ ది కాదు. ఇది మన పార్టీ. ఈ పార్టీకి ప్రజలే ఓనర్లు. సీఎం నాకు మంచి శాఖలు ఇచ్చారు. ఇందులో ఆదాయం పోవుడే తప్ప రాకడ ఉండదు.
గతంలో ఏనాడు తనకున్న పూర్తి భూమిని సాగు చేసిన పరిస్తితి ఉండేది కాదు. ఏదో సమస్య కోసం రైతులు రోడ్లెక్కి పోలీసు దెబ్బలు తినేవారు. ఇప్పుడు సాగు విస్తీర్ణం పెరిగింది. వడ్లు పుష్కలంగా పండాయి. వరికోత మిషన్లు వచ్చిన తర్వాత నేరుగా వడ్లను కొనుగోలు కేంద్రాలకు తేవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. 17 శాతం వచ్చేదాకా కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండటం కష్టం. ఏ ఇతర రాష్ట్రాల్లో 1835 మద్ధతు ధర లేదు. పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేస్తామన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. వేరే రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొని తెలంగాణకు తెచ్చి అమ్మేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి.
రైతులు విడతల వారిగా వడ్లను ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తెస్తే ఇబ్బందులు ఉండవు. కేంద్రం లెవీ ఎత్తివేసినప్పటి నుంచి కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి పక్షాలను మనం పట్టించుకోవద్దు. ప్రజలంతా ప్రభుత్వానికి అండగా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయి. అని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.