
అమ్మాయిలు తమను తాము కాపాడుకునేందుకు కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఆపదలో ఉన్న సమయంలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా వెంటనే 100కి డయల్ చేస్తే నిమిషాల్లోనే స్పాట్ లో పోలీసులు ఉంటారని చెబుతున్నారు. అలాగే మహిళలు ఆత్మరక్షణ కోసం వారి హ్యాండ్ బ్యాగుల్లో కారంపొడి, చిన్న చాకు, పెప్పర్ స్ప్రే, స్టన్ గన్ వంటివి పెట్టుకోవాలని హైదరాబాద్ డీసీపీ సుమతి సూచించారు. విధులపై రాత్రి సమయాలలో బైటకు వెళ్లినా ఉద్యోగరీత్యా వెళ్లినా, లేట్ అయినా కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలనీ తెలిపారు. మొబైల్ లొకేషన్ షేర్ చేయాలనీ, ప్రమాదంలో ఉన్నామనిపిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని చెప్పారు. ప్రమాదంలో ఉన్నామని అనుమానం వస్తే డయల్ 100, 112, 9490617111, షీ టీమ్స్ ల్యాండ్ లైన్ నంబరు 040-2785 2355, వాట్సాప్ నంబరు 9490616555కు సమాచారం ఇవ్వాలన్నారు. టోల్ ఫ్రీ నంబర్లు 112, 1090, 1091 నంబర్లకు కూడా ఫోన్ చేయవచ్చన్నారు.
దేశవ్యాప్తంగా ఇటీవల ప్రారంభించిన 112 ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేస్తే అన్నిరకాల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు పోలీసులు. ఈ ఫోన్ నెంబర్లను ప్రతి మహిళ తన సెల్ ఫోన్ లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రతీ రోజు ఒకే ప్రాంతానికి వెళ్లితే మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిచయం లేని వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మవద్దని..ఒంటిరిగా ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లవద్దని సూచించారు.