బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం .. రాష్ట్రంలో భారీ వర్షాలే

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం .. రాష్ట్రంలో భారీ వర్షాలే

రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇటు అల్పపీడన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే సమయంలో ముసురుతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. 

ఇవాళ ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. ఇక కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది శాఖ. 

రాష్ట్రవ్యాప్తంగా నిన్న భారీ వర్షాలు కురిశాయి. సీజన్ లోనే అత్యధికంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక్కరోజే 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెంలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 9.8 సెంటీమీటర్ల వర్షం పడింది. కామారెడ్డిలో 7 సెంటీమీటర్లు, మెదక్ లో 7.4, నిజామాబాద్ లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మం, నాగర్ కర్నూల్, గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు వాన పడింది. జగిత్యాలలో భారీ వర్షాలు పడుతున్నాయ.

అల్పపీడన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు పడుతున్నాయి. మొన్న రాత్రి మొదలైన ముసురు వాన కంటిన్యూగా పడుతూనే ఉంది. శివారు ప్రాంతాల్లోనూ అక్కడక్కడ వర్షం పడుతోంది. ఇవాళ హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో సిటీ జనం అలెర్ట్ గా ఉండాలని GHMC సూచించింది. వర్షంతో ఏదైనా ఇబ్బందులు కలిగితే వెంటనే GHMCకి కంప్లైంట్ చేయాలన్నారు అధికారులు. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం, నిజామాబాద్ జిల్లా శ్రీరాం సాగర్, కుమ్రంభీం, సింగూరు, తాలిపేరుకు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నిన్న 15 గేట్లను ఎత్తి 9 వేల 493 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు అధికారులు.