ఒంటరితనంతో ప్రాణం తీసుకున్నడు.. 40 రోజుల తర్వాత వెలుగులోకి..

ఒంటరితనంతో ప్రాణం తీసుకున్నడు.. 40 రోజుల తర్వాత వెలుగులోకి..

గచ్చిబౌలి, వెలుగు: రాయదుర్గంలోని గుట్టపై నిర్మానుష్య ప్రాంతంలో లభ్యమైన వ్యక్తి డెడ్​బాడీ కేసును పోలీసులు ఛేదించారు. ఒంటరి జీవితంపై విరక్తి చెంది 40 రోజుల కిందట అతడు ఉరేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని మహాప్రస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై ఆదివారం ఉదయం చెట్టుకు ఓ డెడ్ ​బాడీ ఉరేసుకొని కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడిని ఆసిఫ్ నగర్కు చెందిన కోటపల్లి కిషన్ రాజు(63)గా గుర్తించారు.

కిషన్ రాజు భార్య 8 ఏండ్ల కిందట చనిపోగా, కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. భార్య మరణం అనంతరం ఒంటరిగా ఉంటున్న కిషన్ రాజు ఒంటరి జీవితంపై విరక్తి చెందాడు. జనవరి 23న పెద్ద కుమార్తె వద్దకు వెళ్లి.. తాను కొద్దిరోజులు దూరంగా వెళ్తున్నానని, తనకోసం వెతకవద్దని చెప్పి, తన సెల్ ఫోన్, స్కూటీ వాహనాన్ని వారికి అప్పగించాడు. కుమార్తె వద్ద నుంచి నేరుగా రాయదుర్గం వచ్చిన కిషన్ రాజు గుట్టపై ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిగా కుళ్లిన స్థితిలో మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకొని 40 రోజులు అయ్యి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.