ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ కేవలం రెండు రోజుల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పాటు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లో ముగిస్తే ఆ పిచ్ పై విమర్శలు రావడం సహజం. ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. కోల్ కతా వేదికగా జరిగిన ఈ టెస్ట్ కూడా మూడో రోజు ముగియడంతో పిచ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తొలి రోజు నుంచే స్పిన్ అనుకూలించిందని.. ఇలాంటి పిచ్ లు టెస్ట్ క్రికెట్ కు ప్రమాదకరమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే పెర్త్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్ట్ రెండు రోజుల్లో ముగిసినప్పటికీ ఐసీసీ మంచి రేటింగ్ ఇవ్వడం విశేషం.
పెర్త్‌లో జరిగిన మ్యాచ్ పిచ్ రేటింగ్ పై ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. పెర్త్ పిచ్ బాగుందంటూ "వెరీ గుడ్" అని రేటింగ్ ఇచ్చింది. "పిచ్ ఉపరితలం చాలా బాగుంది. తొలి రోజు బౌన్స్ కు అనుకూలించింది. ఆ తర్వాత సీమింగ్ కదలిక తగ్గింది. బ్యాటర్ల, బౌలర్ల మధ్య బ్యాలన్స్ గా ఈ పిచ్ ఉండి ఫ్యాన్స్ కు చక్కని మ్యాచ్ అందించింది. అని ఐసీసీ చెప్పుకొచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈటెస్ట్ మ్యాచ్ కు ఇక మంచి రేటింగ్ ఇవ్వడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. మూడు, నాలుగు రోజుల టికెట్స్ కొన్న ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. అయితే మ్యాచ్ మాత్రమే మంచి కిక్ ఇచ్చింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే పెర్త్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్ ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోక విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (83 బంతుల్లోనే 123) సెంచరీతో చెలరేగి జట్టుకు వేగంగా గెలుపును అందించాడు. మార్నస్ లాబుస్చాగ్నే (51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 4న జరుగుతుంది.
