కలెక్టర్‌‌‌‌ చెప్పినవన్నీ అవాస్తవాలే .. నాగారం భూములపై హైకోర్టులో రిప్లయ్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ దాఖలు

కలెక్టర్‌‌‌‌ చెప్పినవన్నీ అవాస్తవాలే .. నాగారం భూములపై హైకోర్టులో రిప్లయ్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ దాఖలు
  • భూదాన్ భూముల్లో అక్రమాలు వాస్తవం: పిటిషనర్ బిర్ల మల్లేశ్  

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్‌‌‌‌ భూములకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో కలెక్టర్‌‌‌‌ చెప్పినవన్నీ అవాస్తవాలేనని పిటిషనర్‌‌‌‌ నివేదించారు. నాగారం భూములకు సంబంధించి రికార్డుల తారుమారు, చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు పాస్‌‌‌‌బుక్‌‌‌‌ల జారీకి సంబంధించిన విషయాలను వెల్లడించలేదన్నారు. కలెక్టర్‌‌‌‌ కౌంటర్‌‌‌‌కు సమాధానం ఇస్తూ ఈ మేరకు హైకోర్టులో పిటిషనర్‌‌‌‌ బిర్ల మల్లేశ్‌‌‌‌ బుధవారం రిప్లయ్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ దాఖలు చేశారు. భూదాన్‌‌‌‌ భూములపై కలెక్టర్‌‌‌‌.. రికార్డులను పరిశీలించకుండా తప్పుడు వివరాలతో కౌంటర్ దాఖలు చేశారన్నారు. నాగారంలో సర్వే నెం.181, 182, 194, 195లలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు జరిపించాలంటూ బిర్ల మల్లేశ్‌‌‌‌ గతంలో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు.

 దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్‌‌‌‌ కౌంటర్ దాఖలు చేయగా.. అందులో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని పిటిషనర్ రిప్లయ్ ఇచ్చారు. భూదాన్‌‌‌‌ బోర్డు లేఖ ఆధారంగా సర్వే నెం.181/1, 2, 3లలో 50 ఎకరాలను భూదాన్‌‌‌‌ భూములుగా పేర్కొంటూ 2006లో ప్రభుత్వం మెమో జారీ చేసిందన్నారు. ఈ వాస్తవాన్ని తొక్కిపెట్టి డీనోటిఫై చేయడంతో చట్టవిరుద్ధంగా పాస్‌‌‌‌బుక్‌‌‌‌ల జారీతోపాటు విక్రయ లావాదేవీలు జరిగాయన్నారు. తరువాత అప్పటి కలెక్టర్‌‌‌‌ అమోయ్‌‌‌‌కుమార్, అప్పటి ఎమ్మార్వో ఆర్‌‌‌‌.పి.జ్యోతి, ఆర్డీవో సిఫారసులతో అప్పటి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌‌‌‌ మిట్టల్‌‌‌‌ డీనోటిఫై చేశారన్నారు. 

దీంతో ఏడుగురు ప్రైవేటు వ్యక్తుల పేర్లతో పాస్‌‌‌‌బుక్‌‌‌‌లు జారీ అయ్యాయన్నారు. భూదాన్‌‌‌‌ బోర్డుకు దానం చేసిన భూములను డీనోటిఫై చేయడంగానీ, ప్రైవేటు వ్యక్తులకు క్రమబద్ధీకరించే అధికారంగానీ అధికారులకు లేదన్నారు. కానీ రికార్డులను తారుమారు చేసి అక్రమంగా వారసత్వాలను ఆమోదించి పాస్‌‌‌‌బుక్‌‌‌‌లు జారీ చేశారని ఆరోపించారు. అక్రమ పట్టాపాస్‌‌‌‌బుక్‌‌‌‌ల ఆధారంగా ఐఏఎస్‌‌‌‌లు, ఐపీఎస్‌‌‌‌లు, వారి కుటుంబసభ్యులు తదితరులు కొనుగోలు చేశారని, అంటే వారికి హక్కులపై అవగాహన ఉంటుందన్నారు.