సంక్షోభం కొనసాగితే..పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు : ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

సంక్షోభం కొనసాగితే..పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు : ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
  • సంక్షోభం కొనసాగితే..పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు 
  • ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
  • పెరిగిన ధరల భారాన్ని ప్రజలపై వేయడం తప్పకపోవచ్చని వెల్లడి

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే భారత్ రిటైల్ ఇంధన ధరలను పెంచాల్సి రావచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. మంగళవారం స్విట్జర్లాండ్‌‌లో స్విస్ నేషనల్ బ్యాంక్, ఐఎంఎఫ్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. “పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే, ధరల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై వేయడం తప్పకపోవచ్చు” అని అన్నారు. సంక్షోభం కొనసాగుతుండటంతో ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు ముడి చమురు ధరల పెరుగుదల భారాన్ని భరిస్తున్నామని తెలిపారు. ‘‘పెరిగిన ముడి చమురు ధరల భారాన్ని ప్రభుత్వం భరించడంతో, దేశ ద్రవ్యోల్బణం మార్చిలో 3.40% నుంచి ఏప్రిల్‌‌లో 3.48%కి స్వల్పంగా పెరిగింది.

ఇది అంచనా వేసిన దానికంటే తక్కువ. సరఫరాలో అంతరాయం ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక సమన్వైయం కీలకమవుతుంది” అని మల్హోత్రా పేర్కొన్నారు. ఈ ఇబ్బందులు తాత్కాలికమైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఇవి స్థిరపడిపోతే, తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 4.6%గా ఉండి, వృద్ధి 6.9%గా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.