బీజేపీ అధికారంలోకి వస్తే వందలోపే పెట్రోల్ : హిమంత బిశ్వశర్మ

బీజేపీ అధికారంలోకి వస్తే వందలోపే పెట్రోల్ :   హిమంత బిశ్వశర్మ

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్  ధరను రూ.100 లోపు తెస్తామని అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్  బీజేపీ అభ్యర్థి పంజా విజయ్​ కుమార్ కు మద్దతుగా సోమవారం మెదక్ పట్టణం, వరంగల్​ జిల్లా పరకాలలోని సంగెం మండల కేంద్రంలో పరకాల బీజేపీ క్యాండిడేట్​ పగడాల కాళీప్రసాద్​ తరపున ఆయన ప్రచారం చేశారు.  ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.97కే లభిస్తున్నదని తెలిపారు. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్  విపరీతమైన పన్నులు వేయడంతో లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిందని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచుతామని వెల్లడించారు. 

అలాగే ధాన్యానికి క్వింటాలుకు రూ.2,100 ఉన్న మద్దతు ధరను రూ.3,100కు పెంచుతామన్నారు. ఏటా 4 గ్యాస్  సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్​ దగా చేశారని, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి  చేస్తామన్న హామీని పక్కాగా నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం అయోధ్యలో  రామ మందిరం నిర్మిస్తున్నామని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలను ఉచితంగా అయోధ్య రామ మందిర దర్శనానికి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోడ్ షోలో విజయ్ కుమార్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి రాజశేఖర్, పరిణిత, అధికార ప్రతినిధి నందారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

క్వాలిటీ లేకనే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.30 వేల కోట్లు అవసరమైతే.. దానిని రూ.1.20 లక్షల కోట్లకు పెంచి సీఎం కేసీఆర్​ అవినీతికి పాల్పడ్డారని హిమంత​ బిశ్వ శర్మ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, క్వాలిటీ లేకపోవడంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని, సుందిళ్ల గోదారిలో కొట్టుకుపోయిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.  బీఆర్ఎస్​ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. కాంగ్రెస్​ గ్యారంటీలను నమ్మవద్దన్నారు.