- సామాన్యుడిపై రవాణా భారం.. నిత్యావసరాల ధరలకు రెక్కలు
- 2 వారాల్లోనే లీటర్ పెట్రోల్పై ఏకంగా రూ.8 మేర బాదుడు
- పది రోజుల్లో నాలుగోసారి.. పెట్రోల్‌పై రూ.2.61. డీజిల్‌పై రూ. 2.71 పెంచిన ఆయిల్ కంపెనీలు
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 115.73, డీజిల్ రూ. 103.82
- ఢిల్లీలో పెట్రోల్ ₹102.12, డీజిల్ రూ.95.20కు చేరిక
- 2 వారాల్లోనే లీటర్ పెట్రోల్పై ఏకంగా రూ.8 మేర బాదుడు
- సామాన్యుడిపై రవాణా భారం.. నిత్యావసరాల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల మంట సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. సామాన్యుడి జేబుకు చమురు కంపెనీలు మరోసారి భారీగా చిల్లు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, నష్టాల భర్తీ సాకుతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సోమవారం మరోమారు పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.61, డీజిల్‌పై రూ. 2.71 చొప్పున వడ్డించాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు చేరగా, డీజిల్ ధర రూ. 95.20కు పెరిగింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.73 కి చేరగా, లీటర్ డీజిల్ ధర రూ. 103.82 గా నమోదవుతున్నది. గడిచిన రెండు వారాల వ్యవధిలోనే పెట్రోల్ ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం. ఈ 14 రోజుల్లోనే లీటర్ పెట్రోల్పై ఏకంగా రూ 8 మేర భారం పడింది. అమెరికా–-ఇరాన్ మధ్య నడుస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి మూసివేతలాంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
నిత్యావసరాల ధరలకు రెక్కలు ?
2022 ఏప్రిల్ నుంచి దేశంలో ఇంధన ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. కేవలం 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మాత్రమే లీటరుకు రూ. 2 చొప్పున తగ్గించారు. అయితే, మే 16న ఒక్కసారిగా రూ.3 పెంచడంతో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. అప్పటి నుంచి కేవలం2 వారాల వ్యవధిలోనే నాలుగు సార్లు ధరలు పెరగడం గమనార్హం. ఈ మే నెలలోనే ఇంధన ధరల పెంపు పరంపర నిరంతరాయంగా కొనసాగుతోంది. కేంద్రం మొదటగా ఈ నెల 15న ధరలను పెంచగా, ఆ తర్వాత 19న పెంచింది. ఆ తర్వాత కేవలం రెండు రోజుల వ్యవధిలోనే, అంటే మే 23న కూడా మరో 90 పైసల వరకు ధరలను సవరించింది.
ఇప్పుడు మళ్లీ రెండు రోజులు తిరక్కుండానే నాలుగోసారి భారీగా రేట్లను పెంచేసింది. ఈ వరుస ధరల పెంపుతో రవాణా, లాజిస్టిక్స్ రంగాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. రవాణా చార్జీలు పెరిగితే.. నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన దిగుమతి ఖర్చులను మేనేజ్ చేయడానికి, సరఫరాలో స్థిరత్వాన్ని కాపాడడానికి ఈ ధరల సవరణలు తప్పట్లేదని ప్రభుత్వ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.
శాంతి చర్చలపై ఆశలు.. అస్థిరంగా ముడిచమురు!
పశ్చిమాసియా సంక్షోభంపై ఓఎన్జీసీ డైరెక్టర్ సుష్మా రావత్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తీవ్ర అస్థిరతకు లోనవుతున్నాయని పేర్కొన్నారు.‘‘ఒప్పందం కుదురుతుందనే వార్తలు రాగానే ముడిచమురు ధరలు తగ్గుతున్నాయి. కానీ, తక్షణ పరిష్కారం లభించదని తేలగానే మళ్లీ ధరలు భగ్గుమంటున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు రోజుకు దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర నష్టాలను చవిచూశాయి. అందుకే ఈ సవరణలు తప్పలేదు. అయితే, గత 76 రోజుల పాటు ధరలు పెంచకుండా ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించింది” అని తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ టాప్
దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఏపీలో ఉన్నాయి. ఆ రాష్ట్ర పన్నులు, వ్యాట్ అధికంగా ఉండడంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర.రూ.118.28కు చేరగా, డీజిల్ ధర రూ.105.91గా నమోదైంది. విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలులాంటి నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు రూ.118 దాటాయి. దేశవ్యాప్తంగా అత్యధిక ధరలు ఏపీలోనే కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఉన్నది.
ధరల పెంపు ఇక్కడితో ఆగదు: రాహుల్ గాంధీ
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల జేబులకు చిల్లులు పెట్టడమే కేంద్ర ప్రభుత్వ ఏకైక పనిగా మారిందని ఆరోపించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘ప్రజలకు తెలియకుండా, వారి జేబుల నుంచి నిశ్శబ్దంగా డబ్బులు గుంజడానికే పెట్రోల్, డీజిల్ ధరలను వాయిదాల పద్ధతిలో పెంచుతున్నారు’’ అని మండిపడ్డారు. దేశంలోకి పెద్ద ఆర్థిక తుఫాను రాబోతోందని తాను నెలల తరబడి హెచ్చరిస్తూనే ఉన్నానని, కానీ మోదీ ఎప్పటిలాగే అప్పట్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారని, తీరా ఎన్నికలు ముగియగానే.. పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి రూ.8 మేర పెంచేశారన్నారు. ఈ ధరల పెరుగుదల ఇక్కడితో ఆగేది కాదని, మున్ముందు ఇంకా పెరుగుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎప్పుడు ఎంతంటే..
- మే 15: పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ.3 చొప్పున పెంపు.
- మే 19: లీటరుకు 90 పైసల పెంపు
- మే 23: పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు
- మే 25: పెట్రోల్‌పై రూ. 2.61, డీజిల్‌పై రూ. 2.71
