హైదరాబాద్: ఇంధన ధరలు రోజురోజుకూ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే.. ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచారేమో.. గ్యాస్ రేట్లు పెంచారేమో.. అని టెన్షన్ పడుతున్న రోజులొచ్చేశాయి. అచ్చే దిన్ ఏమో గానీ మన నెత్తిన ధరల పెంపు రూపంలో ఏ పిడుగు నెత్తిన పడిందోననే భయంలో దేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత రోజే CNG గ్యాస్ ధరలు పెరిగాయి. CNG గ్యాస్ కేజీపై రెండు రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో కేజీ CNG ధర 97 రూపాయలుగా ఉంది. రేపోమాపో ఈ 97 రూపాయలు కాస్తా 100 రూపాయలకు పెరిగే అవకాశాలు లేకపోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
దిగుమతి చేసుకుంటున్న ఇన్‌పుట్ గ్యాస్ ధరలు పెరగడంతో సీఎన్‌జీ రేట్లు పెంచామని గ్యాస్ సంస్థలు చెప్పుకొస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడడంతో దిగుమతులు కాస్ట్లీగా మారాయని, దీంతో ఆర్థిక భారాన్ని కొంతవరకు సర్దుబాటు చేసుకోవడానికే ఈ స్వల్ప ధరల పెంపును చేపట్టినట్లు కంపెనీలు చెబుతున్నాయి. అయితే.. పెట్రోల్, డీజిల్ బండ్లతో పోలిస్తే CNG వాహనాల నిర్వహణ ఖర్చు ఇంకా 45 శాతం వరకు తక్కువగా ఉందని కంపెనీ పేర్కొంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, నష్టాల భర్తీ సాకుతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సోమవారం మరోమారు పెంచిన సంగతి తెలిసిందే. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.61, డీజిల్‌పై రూ. 2.71 చొప్పున వడ్డించాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.73 కి చేరగా, లీటర్ డీజిల్ ధర రూ. 103.82 గా ఉంది. 100 రూపాయలు పెట్టినా లీటర్ పెట్రోల్ కొనలేని పరిస్థితులు రావడంతో వాహనదారులు బండి బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు.
