- ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయని షార్టేజ్ చేస్తున్న కంపెనీలు?
- అడిగినంత ఇవ్వడం లేదంటున్న డీలర్లు.
- దొరకదేమోనని డబ్బాల్లో పట్టుకుపోతున్న వాహనదారులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు:కొన్ని రోజుల కింద పెట్రోల్‌బంకుల ముందు బారులు తీరిన రోజులు మర్చిపోకముందే మళ్లీ అదే సీన్నగరంలో రిపీటయ్యింది. సిటీలో ఆదివారం సాయంత్రం నుంచే వాహనదారుల కష్టాలు మొదలుకాగా, సోమవారానికి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. చాలా బంకుల్లో పెట్రోల్స్టాక్ లేదంటూ బోర్డులు దర్శనం ఇచ్చాయి. మరోసారి పెట్రోల్ కొరత వస్తుందన్న ప్రచారంతో చాలా మంది అవసరానికి మించి పెట్రోల్ కొన్నారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, అంబర్‌పేట, కూకట్పల్లి, మాదాపూర్, నాంపల్లి, లక్డీకాపూల్వంటి ప్రాంతాల్లోని పెట్రోల్‌బంకుల ఎదుట వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఫోర్ వీలర్స్, టూ వీలర్లు, ఆటోల క్యూలు పెరిగిపోవడంతో చాలాచోట్ల ట్రాఫిక్‌జామ్స్ ఏర్పడింది. మధ్యాహ్నం వరకు మండుతున్న ఎండలో లైన్లు కట్టగా, సాయంత్రం అక్కడక్కడా వర్షం పడడంతో వానలో తడుస్తూ క్యూలో ఉండాల్సి వచ్చింది. కొందరు తమకు పెట్రోల్, డీజిల్ దొరకదేమోననే భయంతో క్యాన్లు, డబ్బాలు, బాటిల్స్‌లో తీసుకుపోవడం కనిపించింది.
- అడిగినంత ఇవ్వట్లే..
ఆయిల్‌కంపెనీలు తాము కోరినంత పెట్రోల్, డీజిల్సరఫరా చేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని డీలర్లు ఆరోపిస్తున్నారు. వెస్ట్‌బెంగాల్‌లో 29న జరగనున్న రెండో విడత ఎన్నికల తర్వాత పెట్రో రేట్లు పెరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది. ఎన్నికలు ముగిసిన రోజు ఆర్ధరాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తమకు సమాచారం ఉందని పలువురు డీలర్లు ఆరోపించారు. ఈ కారణంగానే ఆయిల్ కంపెనీలు తాము కోరినంత స్టాక్ సరఫరా చేయడం లేదంటున్నారు. పెట్రోధరలు రెండు మూడు రోజుల్లోనే పెంచే అవకాశాలున్న కారణంగా తామెందుకు నష్టాలకు గురికావాలని ఆయిల్ కంపెనీలు అరకొర సరఫరాతో రెండు మూడు రోజులు నెట్టుకు రావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
- ఆయిల్ కంపెనీలు ఏమంటున్నాయి?
అమెరికా, ఇజ్రాయిల్-, ఇరాన్ యుద్ధం వల్ల ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. అయితే సరఫరా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం మాత్రం కొందరు డీలర్లు సకాలంలో డీడీలు చెల్లించకపోవడమేనన్నారు. కొందరు డీలర్లు క్రెడిట్చెల్లించక పోవడం వల్ల కూడా సమస్య పెరిగిందంటున్నారు. కేంద్రం దగ్గర సరిపడా ఆయిల్నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
- ఇతర కారణాలు ఉండొచ్చు
కంపెనీలకు ఇండెంట్పంపినా సరఫరా ఎందుకు లేట్ చేస్తున్నాయనే దానిపై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని తెలంగాణ పెట్రోల్, డీజిల్డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్‌రెడ్డి తెలిపారు. మధ్యలో రెండు రోజుల సెలవు రావడం వల్ల కూడా ఆయిల్ సరఫరా ఆలస్యం కావడానికి కారణం కావచ్చన్నారు. మంగళవారం నుంచి యథావిధిగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటుందని
అన్నారు.
షాద్‌నగర్‌లో పోలీస్పహారా
షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని సుమారు 10 బంకుల్లో ఆదివారం పెట్రోల్ కొరత ఏర్పడింది. నోస్టాక్ బోర్డులు పెట్టకుండా అన్ని బంకుల్లోకి వెళ్లే మార్గాలను తాళ్లతో మూసివేశారు. సోమవారం సాయంత్రం ఒక బంకుకు పెట్రోల్ రాగా దొరుకదన్న భయంతో వాహనదారులు క్యూ కట్టి మరి గంటల తరబడి డబ్బాలు, క్యాన్లతో లైన్లో నిల్చున్నారు. దీంతో పోలీస్ పహారాలో పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాల్సి వచ్చింది.

