- ఐటీ ఉద్యోగి ఖాతా నుంచి రూ. 95 వేలు మాయం
ఘట్కేసర్, వెలుగు: ఫేస్బుక్లో వీడియోలు చూస్తుండగా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫోన్‌ను హ్యాక్ చేసి, సైబర్ నేరగాళ్లు రూ. 95 వేలు కాజేశారు. రాజమండ్రికి చెందిన చందలూరి ముత్యసాయి శ్రీనివాస్ (33) ఘట్కేసర్లోని హెచ్‌పీసీఎల్ టెర్మినల్‌లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తూ స్థానిక హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 5న తన మొబైల్లో ఫేస్బుక్ వీడియోలు చూస్తుండగా, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ. 12,983 డెబిట్ అయినట్లు ఫేక్ మేసేజ్ వచ్చింది.
అనుమానంతో ఖాతాను తనిఖీ చేయగా, నగదు కట్ కాలేదు. కానీ, కొద్దిసేపటికే అతని ఫోన్ స్తంభించిపోయి, స్క్రీన్‌పై ‘ఇన్‌స్టాలింగ్ సిస్టమ్ అప్డేట్’ అనే మెసేజ్ ప్రత్యక్షమైంది. ఫోన్ పని చేయకపోవడంతో ల్యాప్‌టాప్ ద్వారా తన ఈమెయిల్ తనిఖీ చేయగా, ధనలక్ష్మి బ్యాంకు ఖాతా నుంచి రూ. 95 వేలు మాయమైనట్లు గుర్తించి, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి, ఆపై ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
