ప్రభాకర్​ రావు ముందస్తు బెయిల్​ పిటిషన్‌‌ కొట్టివేతప్రభాకర్​ రావు ముందస్తు బెయిల్​ పిటిషన్‌‌ కొట్టివేత

ప్రభాకర్​ రావు ముందస్తు బెయిల్​ పిటిషన్‌‌ కొట్టివేతప్రభాకర్​ రావు ముందస్తు బెయిల్​ పిటిషన్‌‌ కొట్టివేత

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్‌‌ టి.ప్రభాకర్‌‌రావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్​ పిటిషన్‌‌ను డిస్మిస్‌‌ చేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. తననూ ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని కోరుతూ సంధ్య కన్వెన్షన్‌‌ ఎండీ ఎస్‌‌.శ్రీధర్‌‌రావు వేసిన పిటిషన్‌‌ను కూడా కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్‌‌ జె. శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌‌ వాదనల ప్రకారం పిటిషనర్‌‌ ప్రభాకర్‌‌రావుపై తీవ్ర అభియోగాలు ఉన్నాయని గుర్తు చేశారు. కనుక ముందస్తు బెయిలును మంజూరు చేయలేమన్నారు. ప్రాసిక్యూషన్‌‌ తరఫున సీనియర్‌‌ న్యాయవాది సిద్ధార్థ్‌‌ లూత్రా, పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ కేసు నమోదయ్యాక పిటిషనర్‌‌ అమెరికా పారిపోయారని చెప్పారు. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు రాజకీయ నాయకులు, ప్రైవేటు వ్యక్తులు, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్‌‌ చేయించారని చెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ ఓడిపోయినట్లుగా ఎన్నికల ఫలితాలు వెలువడగానే హార్డ్‌‌డిస్క్, ఇతర డేటాను ధ్వంసం చేయించారని చెప్పారు. ఏటా జనవరి, జులై నెలల్లో డేటా ధ్వంసం చేస్తారని, అయితే డిసెంబరులో చేశారని వివరించారు. రివ్యూ కమిటీ అనుమతి మేరకే అన్నీ చేస్తామని చెబుతున్నప్పటికీ పిటిషనర్‌‌ ఇచ్చిన సమాచారం మేరకే రివ్యూ కమిటీ ఆమోదం చెబుతుందన్నారు. 2023 డిసెంబరు వరకు ఆరోగ్యంగా ఉన్నారని, ఆ తర్వాతే అంటే ఎన్నికల ఫలితాల తర్వాతే అనార్యోగం వచ్చిందని చెప్పారని తెలిపారు. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ నేరంలో పిటిషనర్‌‌ సూత్రధారిగా వ్యవహరించారన్నారు. న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌‌ నేపథ్యంలో సుమోటోగా పిటిషన్‌‌ విచారణకు స్వీకరించిందన్నారు. ముందస్తు బెయిలు పిటిషన్‌‌ కొట్టివేయాలని కోరారు. సుప్రీంకోర్టు శ్రవణ్‌‌కుమార్‌‌కు ఇచ్చిన ఉపశమనం తాత్కాలికమేనని, ఆ ఉత్తర్వులు ప్రభాకర్‌‌రావుకు వర్తించవన్నారు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిలు మంజూరు చేయడం లేదని స్పష్టం చేస్తూ.. పిటిషన్‌‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.