- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేస్తుంది : మంత్రి పొన్నం ప్రభాకర్
మహబూబాబాద్ అర్బన్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేస్తుందని, చట్టం ముందు అందరూ సమానులేనన్నారు. సకల జనులు, అన్ని కుల సంఘాలు కలిసి పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు.
వ్యాపారవేత్తలు, నాయకులతో పాటు చివరకు సొంత కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారని, అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీఆర్‌ఎస్ లీడర్లు చేసే ర్యాలీలకు ఎవరూ భయపడరన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మురళీనాయక్, కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షుడు ఉమ పాల్గొన్నారు.
బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి
నర్సంపేట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదని, విభజన హామీలపై ఊసే లేదన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యతా అంశాలపై లిస్ట్‌ను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందించామన్నారు.
తెలంగాణ ప్రయోజనాలు, విభజన హామీలను సాధించుకునేందుకు సీఎంతో పాటు మంత్రులంతా అనేక సార్లు పీఎం మోదీ, కేంద్రమంత్రులను కలిశామని, అయినా స్పందించకపోవడం దారుణం అన్నారు. కనీసం మూసీ నదీ ప్రక్షాళన విషయాన్ని కూడా బడ్జెట్‌లో పేర్కొనకపోవడం సరికాదన్నారు. సమావేశంలో టీపీసీసీ మెంబర్ పెండెం రామానంద్, నాయకులు బత్తిని రాజేందర్, చింతల సాంబరెడ్డి, దేవేందర్‌రావు, పార్వతమ్మ పాల్గొన్నారు.
