
- ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరికి లాభం అనే కోణంలో దర్యాప్తు
హైదరాబాద్, వెలుగు: ఫోన్‌ట్యాపింగ్ కేసులో సిట్‌దర్యాప్తు ముమ్మరం చేసింది. రాజకీయ నేతలతో పాటు జడ్జిలు, సామాన్యుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం వల్ల బీఆర్ఎస్ సహా ఎవరెవరికి లబ్ధి చేకూరిందనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నది. ఈ మేరకు ప్రభాకర్ రావు నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు సిట్‌విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదుసార్లు విచారించిన సిట్‌అధికారులు.. మంగళవారం కూడా సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నించారు.
ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌కు వచ్చిన ప్రభాకర్‌రావును.. వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరితో కూడిన బృందం విచారించింది. 618 మంది ఫోన్ ట్యాపింగ్ లిస్ట్, సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ప్రశ్నించింది. ప్రధానంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్(ఎస్‌వోటీ) కేంద్రంగా జరిగిన అక్రమాల గుట్టువిప్పేందుకు ఆధారాలు సేకరిస్తున్నది. మరోసారి విచారణకు రావాలని సూచించింది.
తీన్మార్ మల్లన్నకు నోటీసులు
ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సిట్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన ఫోన్ నంబర్ ట్యాపింగ్ లిస్ట్‌లో ఉన్నట్లు పేర్కొంది. ట్యాపింగ్ లిస్ట్‌లో ఉన్న ఫోన్‌నంబర్‌ను తెలిపింది. దర్యాప్తులో భాగంగా సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ, సిట్‌ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి నోటీసులు అందించారు. గురువారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని కోరారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీన్మార్ మల్లన్న సహా ఆయన అనుచరులు, క్యూ న్యూస్ సిబ్బంది ఫోన్ నంబర్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ గుర్తించింది. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన 618 మంది లిస్టులో తీన్మార్ మల్లన్న ఫోన్‌నంబర్‌ను గుర్తించి నోటీసులు జారీ చేసింది.