ఫోన్ ట్యాపింగ్ : ఫోన్ నెంబర్స్ లొకేషన్స్ ట్రాక్ చేసి

ఫోన్ ట్యాపింగ్ : ఫోన్ నెంబర్స్ లొకేషన్స్ ట్రాక్ చేసి

ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో రోజుకొక కొత్త విషయం బయటపడుతున్నది. రాష్ట్రంలో జరిగిన బై ఎలక్షన్లే టార్గెట్​గా టాస్క్​ఫోర్స్​ టీం పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు.  మునుగోడు, హుజూరాబాద్‌‌, దుబ్బాక ఉప ఎన్నికలే లక్ష్యంగా ఎస్‌‌ఐబీ ప్రణీత్‌‌రావు టీమ్‌‌ పనిచేసినట్టు స్పెషల్‌‌ టీమ్‌‌ దర్యాప్తులో వెల్లడైంది. 

 ఫోన్‌‌ నంబర్స్,  లొకేషన్స్‌‌ ట్రేస్ చేసి..

స్పెషల్ ఇంటెలిజెన్స్‌‌ బ్రాంచ్‌‌లోని స్పెషల్‌‌ ఆపరేషన్స్‌‌ టార్గెట్స్‌‌ (ఎస్‌‌ఓటీ) టీమ్‌‌ చీఫ్‌‌ ప్రణీత్‌‌రావు నుంచి రాధాకిషన్ రావుకు ఎలాంటి సమాచారం వచ్చిందనే వివరాలు రాబడుతున్నారు. అభ్యర్థులు వారి అనుచరుల ఫోన్‌‌ నంబర్స్‌‌, లొకేషన్స్‌‌ ఎలా గుర్తించేవారనే  కోణంలో రాధాకిషన్ రావును ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. సెర్చ్‌‌ ఆపరేషన్స్‌‌లో హవాలా వ్యాపారుల వివరాల గురించి ఆరా తీసినట్టు సమాచారం. వారి వద్ద సీజ్‌‌ చేసిన డబ్బు ఎక్కడికి తరలించారనే వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. ప్రణీత్‌‌రావు సహా నిందితులు అందరూ  వినియోగించిన ఫోన్ నంబర్స్‌‌ కాల్‌‌డేటా, వాట్సాప్‌‌, సిగ్నల్, స్నాప్‌‌చాట్‌‌ను రిట్రీవ్ చేస్తున్నారు.

ఎస్‌‌ఐబీ నుంచి సమాచారం.. 

పోలీస్ కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావును స్పెషల్​ టీం పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం ఆయన నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. రాధాకిషన్ రావు టాస్క్‌‌ఫోర్స్‌‌లో జాయిన్ అయిన రోజు నుంచి నిర్వహించిన ఆపరేషన్స్‌‌ గురించి ఆరా తీస్తున్నారు. టాస్క్‌‌ పేరుతో సోదాలు చేసి, స్వాధీనం చేసుకున్న డబ్బుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. 

ఎలక్షన్​ కోడ్​ అవకాశంగా చేసుకుని  బై ఎలక్షన్స్‌‌ జరిగిన నియోజకవర్గాల్లో అడ్డగోలుగా ఆపరేషన్స్ చేసినట్టు గుర్తించారు. ఇందుకుగాను సిటీ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్‌‌, వెస్ట్, సెంట్రల్‌‌, నార్త్‌‌, సౌత్‌‌ జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌లో పనిచేసిన ఇన్‌‌స్పెక్టర్లు, ఎస్‌‌ఐల నుంచి సమాచారం సేకరించారు. టాస్క్‌‌ఫోర్స్​ పేరుతో అధికారికంగా, అనధికారికంగా ఎలాంటి ఆపరేషన్స్ చేశారనే డేటా రికార్డ్‌‌ చేస్తున్నారు.