తండ్రిని కొరియర్ చేయటం ఏంటమ్మా.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయి తల్లీ..!

తండ్రిని కొరియర్ చేయటం ఏంటమ్మా.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయి తల్లీ..!

కవర్ పార్సిల్ చేస్తాం.. డబ్బాలు పార్సిల్ చేస్తాం.. వస్తువులను పార్సిల్ చేస్తాం.. ఇది రొటీన్.. మామూలు విషయం.. బెంగళూరులోని ఓ మహిళ మాత్రం.. తండ్రిని ఏకంగా పార్సిల్ చేయటానికి నిర్ణయించింది. అనుకున్నదే తడవుగానే.. పెద్ద గోనె సంచి తీసుకొచ్చింది. అందులో తండ్రిని పార్సిల్ లెక్క పెట్టింది.. బెంగళూరు సిటీ నుంచి మంగుళూరుకు తండ్రిని పార్సిల్ చేయబోయిన ఫ్యామిలీ బాగోతం ఇప్పుడు దేశాన్ని నివ్వెరపరుస్తోంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయమ్మా అంటూ నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అసలు తండ్రి పార్శిల్‌కి సంబంధించిన పూర్తి కథ ఏంటో తెలుసుకుందామా..

బెంగుళూరు నడిబొడ్డున మంగళవారం సాయంత్రం జరిగిన ఒక వింత సంఘటన స్థానికులను, పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. పెరిగిన బస్సు ఛార్జీలపై నిరసన తెలపడానికి ఒక కుటుంబం ఎంచుకున్న ఆప్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఒక వృద్ధుడిని గోనె సంచిలో కుక్కి, కొరియర్ ద్వారా పంపించేందుకు ప్రయత్నించిన ఈ క్రేజీ ఘటన సదాశివనగర్ సమీపంలోని వినాయక సర్కిల్‌ ప్రాంతంలో జరిగింది. 

ఆరుగురు సభ్యులున్న ఒక కుటుంబం వ్యాలీకావల్‌లోని ఒక కొరియర్ ఏజెన్సీకి చేరుకున్నారు. తమ వద్ద ఉన్న ఒక పెద్ద ప్యాకేజీని మంగళూరుకు పంపాలని వారు సిబ్బందిని కోరారు. ఆ గోనె సంచిలో ఏముందని సిబ్బంది ప్రశ్నించగా.. ఆ కుటుంబ సభ్యులు సంచి విప్పారు. అంతే అందులో నుంచి ఒక వృద్ధుడు బయటకు రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. మనిషిని కొరియర్ చేయడం సాధ్యం కాదని సిబ్బంది తేల్చి చెప్పడంతో అక్కడ పెద్ద వాగ్వాదం మొదలైంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ కుటుంబం ఏమాత్రం తగ్గకుండా కొరియర్ సిబ్బందితో గొడవకు దిగటమే. ఒక పార్శిల్‌ను పంపలేనప్పుడు అసలు బిజినెస్ ఎందుకు నడుపుతున్నారు? అంటూ వారు సిబ్బందిని నిలదీశారు. అంతటితో ఆగకుండా.. తమ సమయాన్ని వృధా చేసినందుకు ఏజెన్సీ తమకు పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ వృద్ధుడికి నీళ్లు తాగించి.. "మీరు కాకపోతే మరొకరు మా పార్శిల్‌ను పంపిస్తారు" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ ఫ్యామిలీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టమే కాక.. ప్రజలు పెరుగుతున్న ఛార్జీలపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో కూడా నిరూపిస్తోంది. 

ALSO READ : విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై నో ఎక్స్‌ట్రా ఛార్జ్.. ఫ్రీ !

రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఇదంతా ఉగాది, రంజాన్ పండుగల వేళ విపరీతంగా పెరిగిన బస్సు టికెట్ ధరలపై నిరసనగా చేసిన ఒక సోషల్ మీడియా రీల్ అని తేలింది. బస్సు ఛార్జీలు భరించలేక తన తండ్రిని ఇలా కొరియర్ ప్యాకేజీలా పంపాలని ప్లాన్ చేశామని ఆ కుటుంబంలోని ఒక యువతి పోలీసులకు వివరించింది. ప్రస్తుతం ఈ ఘటనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు కానీ.. కొరియర్ ఏజెన్సీ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. సామాన్యుడి కష్టాల గురించి ఇంత కొత్తగా.. అలాగే వింతగా చూపించిన ఈ కొరియర్ తాత ఘటన ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.