జనగామ లో ఉద్యోగాలు, పెట్రోల్ బంకుల పేరుతో మోసం : ఏసీపీ పండేరి చేతన్ నితిన్

 జనగామ లో ఉద్యోగాలు, పెట్రోల్ బంకుల పేరుతో మోసం : ఏసీపీ పండేరి చేతన్ నితిన్

జనగామ అర్బన్, వెలుగు : ఉద్యోగాలు, పెట్రోల్​ బంకులు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన మోసగాళ్లను జనగామ పోలీసులు అరెస్ట్​ చేశారు. మంగళవారం జనగామ పీఎస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఏసీపీ పండేరి చేతన్ నితిన్ వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులు జనగామకు చెందిన బెలిగిని శివకుమార్, అదిలాబాద్ కు చెందిన ఇల్లందుల శ్రీనివాస్, కరీంనగర్​కు చెందిన ఆకవరం సాయి చరణ్, హనుమకొండకు చెందిన దరావత్ రాజేశ్​ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు పురోహితుడైన శివకుమార్ ప్రజలతో పరిచయాలు పెంచుకొని, వారికి నమ్మకం కలిగించేలా ప్రవర్తించేవాడు. 

ఉన్నతస్థాయి రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి ఉద్యోగాలు, పెట్రోల్ బంక్ లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి, ఆ మొత్తాన్ని మిగితా నిందితులతో పంచుకునేవాడని తెలిపారు. ఈ క్రమంలో జనగామ పీఎస్​లో కేసులు నమోదు కావడంతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగి, హనుమకొండ రోడ్​లోని ఇండియన్ బంక్ వద్ద నిందితులను పట్టుకున్నారు. కేసును ఛేదించిన సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై భరత్, సిబ్బందిని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అభినందించారు.