పిలగాండ్లు..దీపం చేసిన సాయం

పిలగాండ్లు..దీపం చేసిన సాయం

అదొక దట్టమైన అరణ్యం అందులో ప్రకృతి అందాలకు కొదవ లేదు. పచ్చని చెట్లు ఎత్తైన పర్వత సానువులు, పొడవైన తీగలు, మధ్య మధ్య గల గల పారే సెలయేర్లు ఇలా అదొక అద్భుత ప్రపంచం. అంతే కాదు అక్కడ ఎంతో మంది అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. అక్కడ అణువణువు తెలిసిన వారే ఆ ప్రాంతంలో తిరగగలరు. దారి తెలియక ఎవరైనా ప్రవేశిస్తే అగచాట్లు పడటం ఖాయం.


అలాంటి దట్టమైన అడవి మధ్యలో ఒక కొండ అంచుపై ఒక చెంచు జాతులు నివసించే గూడెం ఒకటి ఉంది. అది కొండ శిఖరంపై ఉండటంతో ఆ ప్రాంతం చాలా తక్కువ మందికే తెలుసు. అక్కడి వారు అడవిలో  సహజ సిద్ధంగా దొరికే వాటితో వారు చక్కని జీవితం గడుపుతుంటారు. అలాంటి గూడెంలో వెంకమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె గుడిసె కొండకు అంచున ఉంటుంది. ఆమె గుడిసెకు ఎదురుగా ఒక మనిషి ఎత్తు స్తంభం దానికి పై భాగాన గుంతగా ఉండి అందులో దీపం పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.


వెంకమ్మ అవ్వ తాను అడవికి వెళ్లి ఆహారం సంపాదించుకొనేటప్పుడు అక్కడ దొరికే ఆముదం గింజలు ఏరుకొని వాటిని గానుగలో పట్టించి, పాత నూలు చీరలో ఒక అంచును తుంచి ప్రతిరోజు సాయంత్రం ఇంటి ముందు ఉన్న స్తంభంపై పెద్ద దీపం వెలిగించేది. అందరూ ‘‘నీకేమైన పిచ్చా అంత కష్ట పడి నూనె తీసి ఇంట్లో వెలుతురు పెంచుకోక అలా ఆరుబయట వెలిగిస్తావేంటి? నీకు అవసరానికి నూనె ఎవరిస్తారు చెప్పు?’’ అంటూ రక రకాల ప్రశ్నలు వేసేవారు.


ఇదంతా విన్నా ఏమాత్రం విసుగు చెందని అవ్వ ‘‘ఇంట్లో చీకటి కన్నా ఈ అడవిలో రాత్రి పూట చీకటి ఎక్కువ’’ అంటూ తన పని తాను కానిచ్చేది. ఒకరోజు ఆ దేశ యువరాజు విజయేంద్రుడు వేట కోసం తన సైన్యాన్ని వెంట బెట్టుకొని అడవికి వచ్చాడు.అసలే యువరాజు వెంట వచ్చిన భటులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అపాయం పోంచి వున్నదన్న మాట లెక్క చేయలేదు.


ఒక్క వైపుగా కాకుండా ఎటు పడితే అటు ఒక దిశ అంటూ చూడక వేట కొనసాగించాడు. వేటలో సరైన వ్యూహం లేక ఏదీ చిక్కలేదు. ఒక వైపు ఆకలి మరోవైపు ఆ దట్టమైన అడవిలో దారి తప్పి పోయారు. వెలుతురు కొద్ది కొద్దిగా తగ్గుతోంది యువరాజులో భయం మెల్లగా మొదలైంది. భటులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో అందరూ ఒక్కసారిగా ఆకాశం వైపు చూసారు. తామున్న కొండ అంచున వెలుతురు. ఎక్కడో చిన్న ఆశ వెలుగు ఉన్న చోట మనుషులు ఉంటారని ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెలుతురును చూసుకుంటూ అదే దిశలో వెళ్లి గమ్యం చేరుకున్నారు.


అక్కడికి వెళ్ళేసరికి ఎవ్వరికీ ఒంట్లో శక్తి లేదు. వీళ్ళను చూసిన గూడెం ప్రజలు ఆకలి దప్పులు తీర్చి అసలేం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అన్నీ వివరంగా చెప్పిన యువరాజు ఇంతకీ ‘‘అక్కడ  దీపం వెలిగించింది ఎవరని ?’’ అడిగారు. అవ్వ గురించి చెప్పారు అందరూ,  అవ్వ చేసిన పనికి తమ ప్రాణాలు నిలబడ్డాయని అవ్వ చేసిన సాయాన్ని రాజు గారికి చెప్పి గొప్ప సన్మానం చేశారు. అవ్వను తమ కోటలో ఉండమన్నారు రాజుగారు.


‘‘నేను కోటలో ఉంటే అక్కడ దీపం పెట్టేది ఎవరని?” అమాయకంగా అడిగింది అవ్వ. దీపమే ముఖ్యమని అక్కడికి పంపిన రాజు గారు తానే అప్పుడప్పుడూ వెళ్తూ అవ్వను చూసి వచ్చేవారు. ఇదంతా పట్టించుకోని అవ్వ దీపం వెలిగిస్తూనే ఉంది.
      
            - సింగంపల్లి శేష సాయి కుమార్