
బెంగళూరు: తన కొడుకు ప్రజ్వల్ రేవణ్ణతో పాటు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని జేడీఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అభియోగాలు రుజువైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. రేవణ్ణతో పాటు ఆయన తనయుడు ప్రజ్వల్ రేవణ్ణ వందలాది మంది మహిళలను లైంగికంగా వేధించినట్టు అనేక వీడియోలు బయటికొచ్చాయి. దీనిపై రేవణ్ణ సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘చట్టపరంగా దీనిని ఎదుర్కొంటాం. ఆ వీడియోలన్ని నాలుగైదేండ్ల క్రితం నాటివి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వాటిని బయట పెట్టారు. చట్టప్రకారం వారిని చర్యలు తీసుకోనివ్వండి”అని పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణను సమర్థించే ప్రశ్నే లేదని జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి తేల్చిచెప్పారు.