సాగర్ తీరాన పింక్ పవర్ రన్.. రొమ్ము క్యాన్సర్పై అవగాహనకు కదిలిన 35 వేల మంది రన్నర్స్

సాగర్ తీరాన పింక్ పవర్ రన్.. రొమ్ము క్యాన్సర్పై అవగాహనకు కదిలిన 35 వేల మంది రన్నర్స్
  •  ప్రముఖులు, క్రీడాకారులు, సినీ తారలతో సందడి  

ట్యాంక్ బండ్, వెలుగు:  రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం నెక్లెస్​రోడ్​లో ఆదివారం నిర్వహించిన పింక్‌ పవర్‌ రన్‌ 3.0 కు జోష్​ఫుల్​గా సాగింది. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ నుంచి ప్రారంభమైన ఈ మెగా కమ్యూనిటీ రన్‌లో దాదాపు 35 వేల మందికి పైగా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ఎంఈఐఎల్‌, సుధా రెడ్డి ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ రన్​ను మంత్రి సీతక్క, డీజీపీ ఆనంద్‌, ఎంఈఐఎల్‌ గ్రూప్‌ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుధా రెడ్డి, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌లారా విలియమ్స్‌, ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌(ఈవీ ట్రాన్స్‌) ఉపాధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. హాఫ్‌ మారథాన్‌,10 కి.మీ, 5 కి.మీ, 3 కి.మీ విభాగాల్లో పరుగు నిర్వహించగా, చిన్నారులు, యువతీ యువకులు, వృద్ధులు, విదేశీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  విజేతలకు రూ.75 లక్షల విలువైన నగదు బహుమతులు, మెడల్స్​అందజేశారు. 

రన్​లో రమాబాయి రణ్​వీర్! 

రన్​లో మహారాష్ట్రకు చెందిన రమాబాయి రణ్‌వీర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బీడ్‌ జిల్లా అంబాజోగైకి చెందిన 47 ఏళ్ల రమాబాయి.. తన పిల్లల చదువుల కోసం గతంలో చెప్పులు లేకుండా 5 కిలోమీటర్లు పరుగెత్తి వార్తల్లో నిలిచారు. ఆమె పింక్‌ పవర్‌ రన్‌లో పాల్గొనడం ద్వారా మహిళల పట్టుదల, ఆరోగ్యంపై అవగాహన, సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచింది.