కేంద్రం పంపిన బియ్యాన్నిపేదలకు ఎందుకియ్యలే

కేంద్రం పంపిన బియ్యాన్నిపేదలకు ఎందుకియ్యలే
  • ఏ ప్రభుత్వం కూడా మీలాగ చేయదు..
  • కేసీఆర్​పై పీయూష్​ గోయల్​ ఫైర్​
  • రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే మొన్నటి దాకా బియ్యం సేకరణను ఆపినం
  • కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర సర్కార్​ దిగివచ్చి.. పేదలకు బియ్యం ఇస్తామంటున్నది
  • రాష్ట్రం నుంచి బియ్యం సేకరించాలని ఎఫ్​సీఐని ఆదేశించినం
  • నూకలు తినాలని నేను ఎప్పుడూ అనలేదు
  • ప్రధాని, కేంద్ర మంత్రులపై కేసీఆర్​వి చిల్లర కామెంట్లు

న్యూఢిల్లీ, వెలుగు : పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని తెలంగాణలో కేసీఆర్  సర్కార్  ఏప్రిల్, మే నెలలో ఎందుకు పంపిణీ చేయలేదని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్  ప్రశ్నించారు. పేదల హక్కులను అడ్డుకోవడం ఘోర పాపమని, ఈ పాపాన్ని ఏ ప్రభుత్వమూ చేయదన్నారు. పేద ప్రజల హక్కులను హరించే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పినా స్పందించలేదన్నారు. 

తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల కన్నా రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్​ ఉందని దుయ్యబట్టారు.ప్రధాని, కేంద్ర మంత్రులపై కేసీఆర్, ఆయన కేబినెట్ మంత్రులు, నేతలు చాలా చిల్లర కామెంట్లు చేస్తున్నారని పీయూష్​ గోయల్​ మండిపడ్డారు. ‘‘తెలంగాణ సర్కార్ ఫెయిల్డ్ గవర్నమెంట్. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోకపోవడం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ ఓపీ) అమలు చేయకపోవడం, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద తీసుకున్న కోటా బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయకపోవడంతో రాష్ట్రం నుంచి బియ్యం సేక‌ర‌ణ‌ను నిలిపివేశాం. కేంద్రం తీసుకున్న ఈ కీలకమైన నిర్ణయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది’’ అని ఆయన తెలిపారు. పీఎంజీకేఏవై కింద పేదలకు బియ్యం అందిస్తామని చివరికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నమ్మి తెలంగాణ నుంచి బియ్యం, ధాన్యం సేకరించాలని నిర్ణయించినట్లు గోయల్​ చెప్పారు. ఆ దిశలో ఎఫ్ సీఐకి ఆదేశాలు ఇచ్చామన్నారు. బుధవారం ఢిల్లీలోని కృషి భవన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. ఏ ప్రభుత్వం తన ప్రజలకు అన్యాయం చేయదని, కానీ, తెలంగాణ ప్రభుత్వానికి పేదల పట్ల చింతలేదని, అందుకే ఏప్రిల్​, మే కోటా బియ్యాన్ని పంపిణీ చేయలేదని మండిపడ్డారు.  దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇలా వ్యవహరించిందని దుయ్యబట్టారు.  పేదల ఆహారం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, పీఎంజీకేఏవై కింద  దేశంలో 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి అదనంగా 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని,  ఇందుకోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఇలాంటి పథకాన్ని ఇమాన్ దార్ తో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, దీనిపై పదే పదే తెలంగాణ సర్కార్ కు లేఖలు రాయాల్సి వస్తున్నదని, రిక్వెస్ట్ చేయాల్సి వస్తున్నదని చెప్పారు. తెలంగాణ సర్కార్ తప్పుడు నీతి, తప్పుడు వ్యవహారం వల్ల కేంద్ర ప్రభుత్వం వెంటపడాల్సి వస్తున్నదన్నారు. ఏ ప్రభుత్వాలు అయితే పేదల వరకు బియ్యాన్ని చేర్చవో, ఆ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు.  ‘‘పరుష పదజాలంతో ప్రధాని, కేంద్ర మంత్రులను బెదిరించినంత మాత్రాన రైతులు, ప్రజలు మెచ్చరు. మంచి పనులతో ప్రజల మెప్పుపొందాలి” అని కేసీఆర్​ ప్రభుత్వానికి పీయూష్​ గోయల్​ హితవుపలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలపరచాలని కేంద్రం చూస్తుంటే.. తెలంగాణ సర్కార్ నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు. ఇవన్నీ చాలా బాధకలిగిస్తున్నాయని తెలిపారు.  

నూకలు తినాలని నేను ఎప్పుడూ అనలేదు
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని తాను ఎప్పుడూ అనలేదని గోయల్​ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటిమాటలను నమ్మవద్దని ప్రజలను ఆయన కోరారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్​ఎస్​ ప్రతినిధుల విధానం చూస్తుంటే మరోసారి వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా మంచిదికాదన్నారు.