ఆస్ట్రేలియాలో 10 లక్షల ఇళ్లు కట్టే అవకాశం:పీయూష్ గోయల్

ఆస్ట్రేలియాలో 10 లక్షల ఇళ్లు కట్టే అవకాశం:పీయూష్ గోయల్
  •     భారత కార్మికులను అక్కడికి పంపే ఆలోచన: మినిస్టర్ పీయూష్ గోయల్‌‌‌‌‌‌‌‌

ముంబై: ఆస్ట్రేలియాలో 10 లక్షల ఇళ్లను కట్టడంలో  ఇండియా ఆసక్తి చూపిస్తోంది. ఇందుకు సంబంధించి   తీవ్రంగా చర్చలు జరుపుతున్నామని, దీనికి ఆర్థిక సహాయం కోసం యూఏఈను సంప్రదించామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విలువ  500 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లు (రూ.43 లక్షల కోట్లు) ఉంటుందని  అంచనా. భారత కార్మికులు  ఆస్ట్రేలియాలోని  ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ పొందిన తర్వాత ఇళ్ల నిర్మాణంలో పాల్గొంటారని గోయల్ చెప్పారు. ఈ పెద్ద ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను ఆస్ట్రేలియాలో ఎక్కడ కడతారు? ఇందులో ఇండియా పాత్ర ఏంటి? వంటి అంశాలను ఆయన వివరించలేదు.  కాగా, ఆస్ట్రేలియాలో డిమాండ్- సరఫరా మధ్య అసమతుల్యత వల్ల ఇళ్ల ధరలు పెరిగాయి.  

ఇటీవల అక్కడ  జరిగిన ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఇది నిలిచింది.  యూఏఈతో భాగస్వామ్యం కోసం  ప్రతిపాదనను ఇచ్చామని గోయల్ అన్నారు.  "ఇది ఒక గొప్ప అవకాశం, మనం వినియోగించుకోకపోతే  నష్టపోతాం" అని అన్నారు. ‘‘భారత్, -ఆస్ట్రేలియా మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చర్చలు జరుగుతున్నాయి. అమెరికా విధించిన 50శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌లను ఎదుర్కొంటూ, భారత్ కొత్త మార్కెట్లను వెతుకుతోంది. ఒమాన్‌‌‌‌‌‌‌‌తో రెండు వారాల్లో, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో రెండు నెలల్లో, యూరోపియన్ యూనియన్‌‌‌‌‌‌‌‌తో ఈ ఏడాది చివరికి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈయూతో చర్చల కోసం  బ్రస్సెల్స్‌‌‌‌‌‌‌‌లో సమావేశాలు జరుగుతున్నాయి.  కతార్, చిలీ, పెరూ, దక్షిణాఫ్రికా, తూర్పు యూరప్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై కూడా  పురోగతి ఉంది”అని  గోయల్ వివరించారు.