పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జింఖానా గ్రౌండ్లో అండర్14 క్రికెట్సెలక్షన్స్ నిర్వహించారు. నిర్వాహకులు ఊహించిన దానికంటే ఎక్కువగా క్రీడాకారులు రావడంతో గ్రౌండ్వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. సెలక్షన్స్లో పాల్గొనేందుకు దాదాపు 2000 మంది ప్లేయర్లు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. భారీగా క్రీడాకారులు అక్కడికి చేరుకోవడంతో జింఖానా మైదానం కిక్కిరిసిపోయింది. అందుకు తగ్గట్లుగా హెచ్సీయూ ఏర్పాట్లు చేయలేదు. సెలక్షన్స్ కోసం ప్రకటన ఇచ్చి సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ప్లేయర్ల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.
సరిపడా టెంట్లు, తాగడానికి నీటివసతి ఏర్పాటు చేయలేదు. దీంతో సెలక్షన్స్పై నిర్వాహకులు చేతులెత్తేశారు. మరోవైపు పోలీసు భద్రత లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ముందుగా బందోబస్తు కోసం పోలీసులను సంప్రదించాల్సి ఉండగా, నిర్వాహకులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. చివరి సమయంలో ఏసీపీ గోపాలకృష్ణ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టోకెన్ సిస్టమ్ ద్వారా సెలెక్షన్స్ పూర్తిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

