పోతూ పోతూ షాకిస్తున్న టీమ్లు.. చెన్నైకి లక్నో చెక్‌‌.. ప్లే ఆఫ్స్ ఆశలు క్లిష్టం

పోతూ పోతూ షాకిస్తున్న టీమ్లు.. చెన్నైకి లక్నో చెక్‌‌.. ప్లే ఆఫ్స్ ఆశలు క్లిష్టం
  • 7 వికెట్ల తేడాతో లక్నో విజయం
  • దంచికొట్టిన మార్ష్‌‌, పూరన్‌‌, ఇంగ్లిస్‌‌
  • కార్తీక్‌‌ శర్మ, శివమ్‌‌ దూబే శ్రమ వృథా


ఐపీఎల్‌‌ లో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ వరుస విజయాలకు లక్నో బ్రేక్‌‌ వేసింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌‌లో 7 వికెట్ల తేడాతో చెన్నైపై లక్నో విజయం సాధించింది. టాస్‌‌ ఓడిన చెన్నై 20 ఓవర్లలో 187/5 స్కోరు చేయగా.. లక్నో 16.4 ఓవర్లలో 188/3 రన్స్​ చేసి నెగ్గింది.

లక్నో: ఐపీఎల్‌‌–19లో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ మూడు వరుస విజయాలకు లక్నో సూపర్‌‌జెయింట్స్‌‌ బ్రేక్‌‌ వేసింది. లక్ష్య ఛేదనలో మిచెల్‌‌ మార్ష్‌‌ (38 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 7 సిక్స్‌‌లతో 90), జోస్‌‌ ఇంగ్లిస్‌‌ (36), నికోలస్‌‌ పూరన్‌‌ (32 నాటౌట్‌‌) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌‌లో లక్నో 7 వికెట్ల తేడాతో చెన్నైపై నెగ్గింది. తాజా ఓటమితో సీఎస్‌‌కే ప్లే ఆఫ్స్‌‌ అవకాశాలను క్లిష్టం చేసుకుంది

టాస్‌‌ ఓడిన చెన్నై 20 ఓవర్లలో 187/5 స్కోరు చేసింది. కార్తీక్‌‌ శర్మ (42 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 71), శివమ్‌‌ దూబే (16 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 32 నాటౌట్‌‌) రాణించారు. తర్వాత లక్నో 16.4 ఓవర్లలో 188/3 స్కోరు చేసి నెగ్గింది. మార్ష్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

  • ఆకాశ్‌‌ అదుర్స్‌‌..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన చెన్నై టాప్‌‌ ఆర్డర్‌‌ను లక్నో పేసర్‌‌ ఆకాశ్‌‌ సింగ్‌‌ (3/26) ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి ఓవర్‌‌లో సంజూ శాంసన్‌‌ (20) మూడు ఫోర్లతో జోరు చూపెట్టినా.. రుతురాజ్‌‌ గైక్వాడ్ (13) నిరాశపర్చాడు. లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌తో పాటు బాల్‌‌ను రెండు వైపుల స్వింగ్‌‌ చేసిన ఆకాశ్‌‌.. తన వరుస మూడు ఓవర్లలో రుతురాజ్‌‌, శాంసన్‌‌, ఉర్విల్‌‌ పటేల్‌‌ (6)ను ఔట్‌‌ చేసి ఊహించని షాకిచ్చాడు. దాంతో 37/2తో పవర్‌‌ప్లేను ముగించిన చెన్నై 52/3తో కష్టాల్లో పడింది. 

ఈ దశలో కార్తీక్‌‌ శర్మ, డేవ్లాడ్‌‌ బ్రెవిస్‌‌ (25) నిలకడగా ఆడారు. 8వ ఓవర్‌‌లో సిక్స్‌‌తో ఖాతా తెరిచిన బ్రెవిస్‌‌ సింగిల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేశాడు. అవతలి వైపు కార్తీక్‌‌ కూడా సిక్స్‌‌తో బ్యాట్‌‌ ఝుళిపించాడు. ఫలితంగా తర్వాతి నాలుగు ఓవర్లలో 34 రన్స్‌‌ రావడంతో తొలి 10 ఓవర్లలో సీఎస్‌‌కే 71/3తో నిలిచింది. 11వ ఓవర్‌‌లో ఇద్దరు 4, 6తో 11 రన్స్‌‌ రాబట్టారు. ఆ వెంటనే ప్రిన్స్‌‌ యాదవ్‌‌ను లక్ష్యంగా చేసుకుని కార్తీక్‌‌ 4, 6, 6, 6తో రెచ్చిపోయాడు. 

ఈ క్రమంలో 35 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. కానీ 15వ ఓవర్‌‌లో షమీ (1/41).. బ్రెవిస్‌‌ను ఔట్‌‌ చేసి నాలుగో వికెట్‌‌కు 70 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ను బ్రేక్‌‌ చేశాడు. 15 ఓవర్లలో స్కోరు 127/4కు పెరిగింది. ఈ టైమ్‌‌లో వచ్చిన శివమ్‌‌ దూబే  సింగిల్స్‌‌ తీసినా..  షాబాజ్‌‌ అహ్మద్‌‌ (1/45) వేసిన16వ ఓవర్‌‌లో కార్తీక్‌‌ 6, 4, 4 కొట్టి ఆఖరి బాల్‌‌కు ఔటయ్యాడు. ఐదో వికెట్‌‌కు 20 రన్స్‌‌ జతయ్యాయి. 

చివర్లో లక్నో బౌలర్లు ప్రశాంత్‌‌ వీర్‌‌ (13 నాటౌట్‌‌), దూబేను కట్టడి చేసి రెండు ఓవర్లలో 11 రన్స్‌‌ మాత్రమే ఇచ్చారు. 19వ ఓవర్‌‌లో ఇద్దరు చెరో ఫోర్‌‌, తర్వాతి ఓవర్‌‌లో దూబే 6, 4, 4, 6 దంచాడు. దాంతో రెండు ఓవర్లలో 34 రన్స్‌‌ రావడంతో చెన్నై మంచి టార్గెట్‌‌ను నిర్దేశించింది. 

  • మార్ష్‌‌, ఇంగ్లిస్​, పూరన్‌‌ ధనాధన్‌‌

ఛేజింగ్‌‌లో లక్నో ఓపెనర్లు మార్ష్‌‌, ఇంగ్లిస్‌‌.. సీఎస్‌‌కే బౌలింగ్‌‌ను ఊచకోత కోశారు. తొలి ఓవర్‌‌లో చెరో రెండు ఫోర్లతో మొదలైన విధ్వంసం చివరి వరకు సాగింది. రెండో ఓవర్‌‌లో జాన్సన్‌‌ ఐదు రన్స్‌‌తో కట్టడి చేసినా.. తర్వాతి ఓవర్‌‌లో అన్షుల్‌‌ కాంబోజ్‌‌ రెండు ఫోర్లు ఇచ్చుకున్నాడు. నాలుగో ఓవర్‌‌లో ఇంగ్లిస్‌‌ సిక్స్‌‌ కొడితే.. ఐదో ఓవర్‌‌లో మార్ష్‌‌ 6, 6, 6, 6, 4తో 28 రన్స్‌‌ దంచాడు. ఆ వెంటనే మరో రెండు ఫోర్లు, సిక్స్‌‌తో 21 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. 

దాంతో పవర్‌‌ప్లేలో లక్నో 86/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఫీల్డింగ్‌‌ పెరిగిన తర్వాత కూడా మార్ష్‌‌ ఫోర్లు, సిక్సర్ల జాతర ఆగలేదు. తర్వాతి నాలుగు ఓవర్లలో 38 రన్స్‌‌ రాబట్టడంతో లక్నో స్కోరు ఫస్ట్‌‌ టెన్‌‌లో 124/0కు చేరింది. కానీ 12వ ఓవర్‌‌లో వరుస బాల్స్‌‌లో ఈ ఇద్దరూ ఔట్‌‌ కావడంతో తొలి వికెట్‌‌కు 135 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 14వ ఓవర్‌‌లో అబ్దుల్‌‌ సమద్‌‌ (7)ను జాన్సన్‌‌ (1/39) దెబ్బకొట్టాడు. నికోలస్‌‌ పూరన్‌‌, ముకుల్‌‌ చౌదరీ (13 నాటౌట్‌‌) బ్యాట్లు ఝుళిపించారు. 24 బాల్స్‌‌లో 24 రన్స్‌‌ అవసరమైన దశలో పూరన్‌‌ వరుసగా నాలుగు సిక్స్‌‌లు బాది విజయాన్ని అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు

చెన్నై: 20 ఓవర్లలో 187/5 (కార్తీక్‌‌ శర్మ 71, శివమ్‌‌ దూబే 32, ఆకాశ్‌‌ సింగ్‌‌ 3/26). 

లక్నో: 16.4 ఓవర్లలో 188/3 (మార్ష్‌‌ 90, ఇంగ్లిస్‌‌ 36, ముకేశ్‌‌ 1/24).