
కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి కింద ఆర్థికసాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ యోజన పథకం కింద 20వ విడత నిధులను విడుదలకు సన్నాహాలు చేస్తుంది.వచ్చే నెలలో అంటే జూన్ 2025 లో రైతులకు వారి ఖాతాలో 2 వేల రూపాయిలు కేంద్ర ప్రభుత్వం జమచేయనుంది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వం ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో 2025 ఫిబ్రవరి 24న ప్రధాన మంత్రి మోదీ బీహార్ లోని భాగల్ పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పీఎం కిసాన్ నిథులను విడుదల చేశారు. జూన్ నెలలో విడుదలయ్యే పీఎం కిసాన్ నిథులు బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈ కేవైసీ (E-KYC)ని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్లో కూడా ఈ రూల్ పాటించాలని స్పష్టంగా చెప్పారు. ఈ కేవైసీ పూర్తి చేయకుంటే రూ. 2,000 మొత్తం రైతుల అకౌంట్లో జమ కాదు. అంతేకాదు రైతులు తమ భూమి రికార్డులు కూడా పరిశీలించుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను రద్దు చేసి కొత్తగా భూ భారతి పోర్టల్‌ను ప్రవేశ పెట్టింది. మీ భూములకు సంబంధించి వివరాలను https://bhubharati.telangana.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంకు అకౌంట్స్ ఆధార్ కార్డులతో లింక్ అయి ఉండాలి. ఈ వివరాలు సరిగా లేకపోతే రావాల్సిన డబ్బులు అకౌంట్లో ఆగిపోతాయి.
ఈ కేవైసీ ఎలా..
రైతులు ఇళ్ల నుంచే ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు. https://pmkisan.gov.in హోంపేజీలో కనిపించే e-KYC ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. Search పై క్లిక్ చేసి ఆ తర్వాత ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ కు OTP వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఇ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.