ఏడాదిలో కోటి మందికి ఏఐ ట్రెయినింగ్

ఏడాదిలో కోటి మందికి ఏఐ ట్రెయినింగ్
  •  
  • ఎర్రకోట పైనుంచి ప్రధాని మోదీ ప్రకటన 
  •     పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌‌‌‌లైన్ కోచింగ్ 
  •     సివిల్ డిఫెన్స్‌‌‌‌లో సంస్కరణలు.. పిల్లల కోసం స్పోర్ట్స్ టాలెంట్ హంట్ 
  •     సెమీకండక్టర్ల తయారీ విస్తరణ.. అణు విద్యుత్‌‌‌‌ ఉత్పత్తికి కొత్త లక్ష్యాలు
  •     దేశ ఆర్థిక, వ్యూహాత్మక అభివృద్ధి కోసం ‘సప్తధారలు’ 
  •     మహిళా కోటా అమలుకు ప్రతిపక్షాలు సహకరించాలి 
  •     దేశంలో సాయుధ నక్సలిజం అంతమైంది.. 
  • కానీ ‘దిమాకీ నక్సల్స్’ పొంచి ఉన్నారని కామెంట్ 
  •     వరుసగా 13వ సారి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం 

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా రాబోయే ఏడాది కాలంలో కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ట్రెయినింగ్ ఇప్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్‌‌‌‌లైన్ కోచింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ టాలెంట్ హంట్ నిర్వహిస్తామని, దేశ ఆర్థిక, వ్యూహాత్మక అభివృద్ధి కోసం ‘సప్తధారలు’ అనే ఏడు అంశాలతో రోడ్‌‌‌‌మ్యాప్ రూపొందించామని తెలిపారు. శనివారం  ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘దేశాన్ని డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌‌‌‌గా మారుస్తాం. సివిల్ డిఫెన్స్ నెట్‌‌‌‌వర్క్ ఏర్పాటు చేస్తాం. మరో మూడు కోట్ల మంది మహిళలను లఖ్‌‌‌‌పతి దీదీలుగా చేస్తాం” అని ప్రకటించారు. 

వీటితోపాటు అణు విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి, సెమీకండక్టర్ల తయారీ విస్తరణ, ఇతర పలు ప్రణాళికలతో 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ కోసం తన రోడ్‌‌‌‌మ్యాప్‌‌‌‌ను మోదీ ఆవిష్కరించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలుచేయడంలో ప్రతిపక్షాలు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి యువత నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.    

యువతకు ఏఐ ట్రైనింగ్.. ఫ్రీ ఆన్‌‌‌‌లైన్ కోచింగ్

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ సమ్మిట్‌‌‌‌ను విజయవంతంగా నిర్వహించామని ప్రధాని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా యువతలో ఏఐ నైపుణ్యాలను పెంచడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. ‘‘రాబోయే ఒక ఏడాదిలో కోటి మంది యువతకు ఏఐ స్కిల్ ట్రైనింగ్ అందించడానికి మేం కృషి చేస్తాం.  తద్వారా మన దేశ యువత ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని మన యువత పొందుతారు’’ అని ఆయన చెప్పారు. అలాగే, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గాను వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత ఆన్‌‌‌‌లైన్ కోచింగ్‌‌‌‌ను కూడా అందిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. ‘‘మన వద్ద డిజిటల్ పబ్లిక్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అద్భుతమైన ప్రతిభ, టీచర్లు ఉన్నారు. ఈ వనరులను ఒకేచోటికి చేర్చడం ద్వారా, దేశ యువతకు ఉచిత కోచింగ్‌‌‌‌ను అందించడానికి మేం ఒక పూర్తి నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను నిర్మించబోతున్నాం” అని తెలిపారు.  

సివిల్ డిఫెన్స్ నెట్‌‌‌‌వర్క్ 

ఆధునిక శిక్షణ, మెరుగైన సామర్థ్యాల ద్వారా మారుతున్న భద్రత, అత్యవసర సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సివిల్ డిఫెన్స్ సంస్కరణలను చేపడుతోందని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘రాబోయే రోజుల్లో మేము ఒక వైబ్రెంట్ సివిల్ డిఫెన్స్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని నేడు ఎర్రకోట నుంచి ప్రకటిస్తున్నాను. మేం వాటిని ఆధునిక వ్యవస్థలతో పరిచయం చేస్తాం. ఆధునిక కాలపు సంక్షోభాల నుంచి పౌరులను రక్షించడానికి ఏయే చర్యలు తీసుకోవచ్చు? సమకాలీన సవాళ్లను అధిగమించగల సామర్థ్యం గల భారీ, ఆధునిక సివిల్ డిఫెన్స్ వాలంటీర్ ఫోర్స్‌‌‌‌ను మేం సృష్టించబోతున్నాం’’ అని చెప్పారు.

దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ ట్యాలెంట్ హంట్

ఒలింపిక్స్ క్రీడలలో తన ఉనికిని గణనీయంగా మెరుగుపరచుకోవాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని, 2036 ఒలింపిక్స్‌‌‌‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బలమైన పోటీదారుగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. భారతదేశ క్రీడా ప్రతిభావంతులను గుర్తించడానికి గాను ప్రభుత్వం దేశవ్యాప్త టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్‌‌‌‌ను ప్రారంభిస్తోందని వెల్లడించారు. ‘‘దేశంలోని ప్రతి మూలన ఉన్న ట్యాలెంట్‌‌‌‌ను గుర్తించడానికి 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం దేశవ్యాప్త ట్యాలెంట్ హంట్‌‌‌‌ను ప్రారంభిస్తున్నాం. వారు ప్రపంచ స్థాయి అథ్లెట్లుగా మారడానికి ప్రత్యేక శిక్షణ పొందుతారు”అని ప్రధాని పేర్కొన్నారు.    

దేశ ఆర్థిక, వ్యూహాత్మక అభివృద్ధికి ‘సప్తధారలు’ 

దేశ ఆర్థిక, వ్యూహాత్మక వృద్ధి కోసం ఏడు అంశాలతో ఒక రోడ్‌‌‌‌మ్యాప్‌‌‌‌ను ప్రధాని ప్రకటించారు. వీటిలోని ఏడు అంశాలను ‘సప్తధారలు’ అని ఆయన అభివర్ణించారు. మాన్యుఫాక్చరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, రక్షణ, గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ, సాఫ్ట్ పవర్‌‌‌‌ను ‘సప్తధార’ మార్గాలుగా మోదీ పేర్కొన్నారు. 

సెమీకండక్టర్‌‌‌‌‌‌‌‌ల తయారీకి ఊతం 

డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సెమీకండక్టర్ సాంకేతికత ప్రాముఖ్యతను ప్రధాని హైలైట్ చేశారు. భారత్ ఈ రంగంలో స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందని చెప్పారు. ‘‘నేటి ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువులు అయినా, వైద్య పరికరాలు అయినా లేదా రవాణా వ్యవస్థలు అయినా, చిప్‌‌‌‌లు చాలా అవసరం. అవి లేకపోతే ప్రపంచం నిలిచిపోతుంది’’ అని అన్నారు.

అణు శక్తి విస్తరణకు ప్రణాళికలు

దీర్ఘకాలిక ఇంధన భద్రతలో అణు శక్తి పాత్ర కీలకమని ప్రధాని అన్నారు. దేశ అణు శక్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రతిష్టాత్మక లక్ష్యాలను ప్రకటించారు. ‘‘అణు శక్తి అనేది ఇంధన భద్రతకు ఒక ప్రధాన సాధనం. పార్లమెంటులో  చట్టం ఆమోదించడం ద్వారా మేం కొత్త లక్ష్యం వైపు మార్గం సుగమం చేశాం. 2047 నాటికి, 100 గిగావాట్ల అణు విద్యుత్‌‌‌‌ను సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం”అని వెల్లడించారు.

మరో 3 కోట్ల లఖ్‌‌‌‌పతి దీదీలు

దేశంలో మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయాలన్న లక్ష్యాన్ని అధిగమించామని ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పుడు మరో మూడు కోట్ల మంది లఖ్‌‌‌‌పతి దీదీలను సృష్టించాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు. మహిళల శక్తి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మరో మూడు కోట్ల మంది లఖ్‌‌‌‌పతి దీదీల సృష్టి భారీ పరివర్తనను తీసుకువస్తుందని చెప్పారు.

గ్లోబల్ డిఫెన్స్ హబ్‌‌‌‌గా భారత్ 

భారత్‌‌‌‌ను గ్లోబల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌‌‌‌గా మార్చాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. హైపర్‌‌‌‌‌‌‌‌సోనిక్ టెక్నాలజీ, డ్రోన్ సిస్టమ్స్ వంటి అధునాతన సామర్థ్యాలలో స్వయం సమృద్ధిని సాధించాలన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌‌‌‌ను నిర్మించడం కోసం ఏడు కీలక అంశాలు అవసరమని.. వీటిలో ‘రక్షా శక్తి’ కూడా ఒకటన్నారు. స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ‘సుదర్శన్ చక్ర’ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. మేడ్- ఇన్- ఇండియా రక్షణ రవాణా విమానం సీ295 ఇప్పటికే విజయవంతంగా ఆకాశంలో విహరించింది’’ అని ఆయన చెప్పారు. 

 వరుసగా 13వ సారి.. 

ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి వరుసగా 13వ సారి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. నెహ్రూ (17 సార్లు) తర్వాత వరుసగా అత్యధిక సార్లు ఎర్రకోటపై నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా మోదీ నిలిచారు. అలాగే, మోదీ ఈసారి  రాజస్థాన్, గుజరాత్‌‌‌‌ సాంప్రదాయ టై- అండ్ -డై ఎరుపు రంగు తలపాగా ధరించి వచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులందరికీ నివాళులర్పించారు. ఉదయం రాజ్‌‌‌‌ఘాట్‌‌‌‌లోని గాంధీ స్మారక స్థలంలో నివాళులర్పించారు.  కాగా, ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో శనివారం జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత తొలిసారిగా జాతీయ గేయం వందేమాతరాన్ని ప్లే చేశారు.

దిమాకీ నక్సల్స్‌ పొంచి ఉన్నరు..

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశంలో నక్సలిజం అంతమైందని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘అడవుల నుంచి సాయుధ నక్సల్స్‌ను తొలగించడంలో, ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో మేం విజయం సాధించాం. అయితే, సాయుధ నక్సల్స్ పోయినప్పటికీ, దేశంలో ‘దిమాకీ(మేధోపరమైన) నక్సల్స్’ చుట్టూ పొంచివున్నారు”అని కామెంట్ చేశారు. ఈ మావోయిజం భావజాలాన్ని కలిగి ఉన్న వ్యక్తులు దేశంలోని అధికార కారిడార్లలో, ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా ఏండ్లుగా పాతుకుపోయారని అన్నారు. ఈ ‘మావోయిస్టు మనస్తత్వం’ విధాన రూపకల్పనను ప్రభావితం చేసిందని ఆయన చెప్పారు. 

జనగణన కోసంఓ గంట టైమ్ ఇవ్వండి..  

జాతీయ జనగణనలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని మోదీ కోరారు. యువత తమ సమయంలో ఓ గంటను కేటాయించాలని పిలుపునిచ్చారు. ‘‘నేను మీ అందరి సహాయం కోరుతున్నాను. దేశం కోసం నేను ఒకటి లేదా రెండు గంటల్లో ఏమి చేయగలను అని మీరు భావించవచ్చు. నేను మీకు చెప్తున్నాను. ఆ ఒకటి లేదా రెండు గంటలు దేశానికి గొప్ప శక్తి వనరుగా మారగలవు” అని ఆయన అన్నారు. సెన్సస్ 2027లో ప్రతి ఇంటినీ భాగస్వామ్యం చేయాలని కోరారు. ‘‘ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి, మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ జనగణన సమాచారాన్ని మీరే అందించవచ్చు’’ అని సూచించారు.