ఢిల్లీ చేరుకున్న సైనికుల మృతదేహాలు

ఢిల్లీ చేరుకున్న సైనికుల మృతదేహాలు

న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సహా 13మంది మృతదేహాలకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సాయంత్రం ఏడుగున్నర గంటల తర్వాత మృతదేహాలు ఎయిర్ ఫోర్స్  పాలం ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే, నేవీ ఛీఫ్ అడ్మిరల్ హరి కుమార్, ఎయిర్ పోర్స్ చీఫ్ VR  చౌధరీ ఏయిర్ బేస్ కు వచ్చారు. 9గంటల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్ బేస్ కు వచ్చి ముందుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మృతదేహం దగ్గర నివాళులర్పించారు. తర్వాత వరుసగా అన్ని మృతదేహాలపై పూలు చల్లి నివాళులర్పించారు. తర్వాత బిపిన్ రావత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ వెంటనే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, NSA అజిత్ దోవల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లు వరుసగా నివాళులర్పించారు. 
 

అంతకుముందు బిపిన్‌ రావత్‌ కుటుంబసభ్యులతో పాటు మరికొందరు అమరులైన వారి కుటుంబసభ్యులు అంజలి ఘటించారు.

కాగా, తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్‌ స్టాఫ్ కాలేజీకి వెళ్తుండగా నిన్న  ఉదయం కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్‌‌ కూలి సీడీఎస్ జనరల్ బిపిన్‌ రావత్, ఆయన భార్య మధులిక, మరో 11 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నిన్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు హెలికాప్టర్‌‌లో ప్రయాణిస్తుండగా తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన ప్రమాదంలో 13 మంది మరణించగా.. ఒక్క వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆయనను వెల్లింగ్టన్‌లోని ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించాలని ఆర్మీ డాక్టర్లు నిర్ణయించారు. లైఫ్ సపోర్ట్‌పై ఉన్న ఆయనను అంబులెన్స్‌లో సూలూరు ఎయిర్‌‌బేస్‌ వరకూ తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఆర్మీ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకెళ్లారు.

మరోవైపు ఇప్పటిదాకా... బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్, బ్రిగేడియర్ LS లిద్దర్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ ల మృతదేహాలను మాత్రమే గుర్తించారు. లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ B సాయితేజ, వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ K సింగ్, JWO రానా ప్రతాప్ దాప్, JWO ప్రదీప్ ల మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.