ప్రపంచంలో మనది స్పెషల్​ ప్లేస్

ప్రపంచంలో మనది స్పెషల్​ ప్లేస్
  • ప్రపంచంలో మనది స్పెషల్​ ప్లేస్
  • దాన్ని మనకు మనమే సృష్టించుకున్నం: మోడీ
  • 2022 మనదేశానికి చాలా ప్రత్యేకమైనది
  • ఈ కాలంలో ఎన్నో విజయాలు సాధించామని వెల్లడి
  • కరోనా కేసులు పెరుగుతున్నయ్.. అలర్ట్​గా ఉండాలని సూచన

న్యూఢిల్లీ: మన దేశానికి సంబంధించినంత వరకు 2022 ప్రత్యేకమైనదని, స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఈ కాలంలో మనదేశంలో ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మనది స్పెషల్​ ప్లేస్​ అని, దాన్ని మనకు మనమే సృష్టించుకున్నామని పేర్కొన్నారు. ఆదివారం మన్​కీ బాత్​లో మోడీ మాట్లాడారు. ఈ ఏడాది ఇదే చివరి మన్​కీ బాత్. 2022లో మన దేశం సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎకానమీ హోదాను పొందామని, 220 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్​లతో అద్భుతమైన రికార్డును సాధించామని, ఎగుమతుల్లో 400 బిలియన్ డాలర్లను అధిగమించామని చెప్పారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవడంతో ‘అమృత్ కాల్’ ప్రారంభమైందని, ఈ ఏడాది దేశం కొత్త పుంతలు తొక్కిందని, అంతరిక్షం, డ్రోన్, రక్షణ రంగాల్లో ఎంతో పురోగతి సాధించామని చెప్పారు. ఆగస్టులో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని ఎవరు మరిచిపోగలరు అంటూ కొనియాడారు. ఆరు కోట్ల మందికిపైగా త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు దిగి పోస్ట్ చేశారని గుర్తుచేశారు.

అప్రమత్తంగా ఉండాలి

చాలా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అలర్ట్​గా ఉండాలని ప్రజలకు ప్రధాని సూచించారు. కరోనా వ్యాప్తి చెందినపుడు యోగా, ఆయుర్వేదం ఫలితాలను ప్రత్యక్షంగా చూశామని, వీటిని సాక్ష్యాధారాలతో నిరూపించే దిశగా పరిశోధనలు సాగాలని చెప్పారు. యోగా, ఆయుర్వేదం లాంటి సంప్రదాయ చికిత్స మార్గాల గురించి తెలిస్తే సోషల్​ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలని కోరారు. ఈ పద్ధతులు ప్రస్తుత మెడిసిన్​కు గీటురాయిగా నిలుస్తున్నాయన్నాయని చెప్పారు.

వాజ్​పేయిది అసాధారణ నాయకత్వం

మాజీ ప్రధాని అటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి జయంతి రోజున ప్రజలతో మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందని మోడీ అన్నారు. వాజ్​పేయి దేశానికి అసాధారణమైన నాయకత్వాన్ని అందించారని, ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని ప్రశంసించారు. ఆయన జీవితం నుంచి ఎన్నో విలువలు నేర్చుకోవచ్చన్నారు. దేశానికి ఆయన ఎంతగా సేవచేశారనేది తెలియాలంటే.. ఢిల్లీలోని ప్రధానమంత్రి మ్యూజియానికి రావాలని చెప్పారు. ఈ సందర్భంగా వాజ్​పేయికి ప్రధాన మోడీ నివాళులర్పించారు. మరోవైపు క్రిస్మస్, న్యూఇయర్​ సందర్భంగా దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని ఆయన ఆకాంక్షించారు.