V6 News

సిక్కిం.. తూర్పు భారత స్వర్గం...50 ఏండ్ల క్రితం భారత ఆత్మతో అనుసంధానం: ప్రధాని మోదీ

సిక్కిం.. తూర్పు భారత స్వర్గం...50 ఏండ్ల క్రితం భారత ఆత్మతో అనుసంధానం: ప్రధాని మోదీ
  •     గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పట్టించుకోలేదు
  •     బీజేపీ వచ్చిన తర్వాతే సిక్కింలో డెవలప్‌‌మెంట్‌‌
  •     త్వరలోనే ఈ రాష్ట్రం రైలు కూత వింటుంది
  •     సిక్కిం స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగం

గ్యాంగ్‌‌టక్‌‌: సిక్కిం రాష్ట్రం తూర్పు భారత స్వర్గధామం అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేవలం ప్రకృతి అందాలకే కాదు, ఆధ్యాత్మిక శాంతికి కూడా సిక్కిం నెలవని, ఇక్కడి ఆర్కిడ్ గార్డెన్‌‌లను చూడని వారు అసలైన సౌందర్యాన్ని చూడనట్లేనని వ్యాఖ్యానించారు. భారత యూనియన్‌‌లో సిక్కిం అంతర్భాగమై 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం గ్యాంగ్‌‌టక్‌‌లో జరిగిన ‘స్వర్ణోత్సవ వేడుకల’ ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ  పాల్గొన్నారు. సుమారు రూ.4 వేల కోట్లకు పైగా విలువైన 30కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గ్యాంగ్‌‌టక్‌‌లోని ఆర్కిడేరియంను సందర్శించి, అక్కడి జీవవైవిధ్యాన్ని చూసి  ముగ్ధులయ్యారు. 

పాల్జోర్ స్టేడియంలో జరిగిన భారీ సభలో ప్రధాని మోదీ భావోద్వేగంగా ప్రసంగించారు. 50 ఏండ్ల క్రితం సిక్కిం కేవలం భారతదేశ భౌగోళిక పటంతోనే కాదు.. ఈ దేశ ఆత్మతో మమేకమైందని అన్నారు. రాష్ట్రాన్ని త్వరలోనే వెల్‌‌నెస్‌‌ హబ్‌‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, బీజేపీ వచ్చిన తర్వాతే డెవలప్‌‌మెంట్‌‌ ప్రారంభం అయిందని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన సెవోక్-రంగ్‌‌పో రైల్వే ప్రాజెక్టును తమ ప్రభుత్వం వేగవంతం చేసిందని, త్వరలోనే సిక్కిం రైలు కూత వింటుందని స్పష్టం చేశారు.

పర్యాటకాన్ని ప్రోత్సహిస్తం..

సిక్కింలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భలేధంగా, పెల్లింగ్‌‌లాంటి ప్రాంతాల్లో రోప్‌‌వేలు, కొత్తగా స్కైవాక్‌‌ల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. బాగ్‌‌డోగ్రా నుంచి సిక్కింకు ఎక్స్‌‌ప్రెస్‌‌వే నిర్మిస్తామని ప్రకటించారు. 

సిక్కిం దేశానికే గర్వకారణమని, ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి చెందవచ్చని ఈ రాష్ట్రంఈ నిరూపించిందని మోదీ తెలిపారు. రాష్ట్రంలో రహదారులు చాలా పరిశుభ్రంగా ఉన్నాయని, ఎక్కడా చెత్తా చెదారం కనిపించలేదని చెప్పారు. 100 శాతం సేంద్రియ రాష్ట్రంగా ఎదిగి ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదానికి దిక్సూచిగా నిలిచిందని ప్రశంసించారు. ఏక్‌‌ భారత్‌‌, శ్రేష్ఠ్‌‌ భారత్‌‌ నినాదానికి మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్య సాధనలో సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు ‘అష్టలక్ష్మి’ లాగా  కీలక పాత్ర పోషిస్తాయని మోదీ పేర్కొన్నారు.

మైదానంలో యువతతో ఫుట్‌‌బాల్..

సిక్కింలో అధికారిక కార్యక్రమాలకు ముందు గ్యాంగ్‌‌టక్‌‌లో స్థానిక యువతతో కలిసి ప్రధాని మోదీ సరదాగా ఫుట్‌‌బాల్ ఆడారు. బ్లూ కలర్‌‌‌‌ స్పోర్ట్స్ జాకెట్ ధరించిన మోదీ, కుర్రాళ్లతో కలిసి బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ, గోల్ కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ ఆటకు సంబంధించిన ఫొటోలను సోషల్‌‌ మీడియాలో షేర్‌‌ చేశారు. గ్యాంగ్‌‌టక్‌‌లో యువ మిత్రులతో కలిసి ఆడడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.  ‘‘సిక్కిం యువతలోని ఉత్సాహం చూస్తుంటే దేశ భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతోంది” అని రాసుకొచ్చారు.