ఉద్యోగం కోసం అప్లై చేసి, ఇంటర్వ్యూలు ఇచ్చి.. ఆ తర్వాత కంపెనీ నుంచి ఎలాంటి రిప్లై రాకపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. ఆ నిరీక్షణలో ఉండే నరకం, ఫోన్ నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారీ కలిగే ఆశ.. తీరా చూస్తే అది కంపెనీ మెయిల్ కాదని తెలిసినప్పుడు కలిగే నిరాశ. రిజెక్ట్ చేసినా పర్లేదు కానీ, కనీసం సమాధానం కూడా ఇవ్వరా? అని పిచ్చ కోపం వస్తుంది చాలా మంది యువతకు. సరిగ్గా ఇలాంటి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఒక కుర్రాడు.. తనను పట్టించుకోని కంపెనీలపై పగ తీర్చుకోవడానికి ఏకంగా క్షుద్ర పూజలు చేయించటం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హాంగ్‌కాంగ్‌లో పర్యటిస్తున్న కంటెంట్ క్రియేటర్ షో దివాన్.. చేసిన ఈ వెరైటీ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాబ్ మార్కెట్ దారుణంగా ఉందని, అప్లై చేసినా రిప్లై ఇవ్వని కంపెనీలన్నింటినీ శపించడానికి అతను దాదాపు రూ.470 ఖర్చు చేయటం వినటానికి నవ్వొస్తున్నా దాని వెనుక అతని ఫ్రస్టేషన్ క్లియర్ గా కనిపిస్తోంది.
ఏమిటీ వింత ఆచారం?
హాంగ్‌కాంగ్‌లోని కాజ్‌వే బే ప్రాంతంలో ఒక వంతెన కింద 'విలన్ హిట్టింగ్' అనే పురాతన ఆచారం ఒకటి ఉంది. దీన్ని స్థానికంగా 'దా సియు యాన్' అని పిలుస్తారు. అక్కడ కొందరు వృద్ధ మహిళలు కూర్చుని.. మనకు నచ్చని వ్యక్తులు లేదా మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యల నుంచి విముక్తి కలిగిస్తామంటూ ఈ పూజలు చేస్తుంటారు.
చెప్పుతో కొట్టి.. శాపం పెట్టి
ఈ ఆచారంలో భాగంగా.. మనకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తి పేరునో లేదా సమస్యను ఒక కాగితపు బొమ్మపై రాస్తారు. ఆ తర్వాత అగరబత్తులు వెలిగించి దేవుడిని ప్రార్థిస్తూ.. ఆ కాగితాన్ని చెప్పుతో పదే పదే కొడతారు. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుందని, శత్రువుల ప్రభావం తగ్గుతుందని అక్కడి వారి నమ్మకం. దివాన్ కూడా తనను ఇగ్నోర్ చేసిన కంపెనీల పేర్లను చెప్పి.. ఆ ఆంటీల ద్వారా వాటికి శాపనార్థాలు పెట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నెటిజన్ల రియాక్షన్:
ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకరు తనను రిజెక్ట్ చేసిన కంపెనీల లిస్ట్ 300 అని, తాను కూడా అక్కడికి రావాల్సిందే అని కామెంట్ చేయగా.. ఆన్లైన్‌లో శపించే సౌకర్యం ఏమైనా ఉందా? అని మరొకరు సరదాగా వీడియో కింద పోస్ట్ పెట్టారు. కొందరైతే దీని కోసం ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ కొనేకంటే.. ఆ 5 డాలర్లు నాకిస్తే నేనే స్వయంగా గట్టిగా తిడతా అంటూ జోకులు పేల్చుతున్నారు.
ఇది కేవలం ఒక మూఢనమ్మకం మాత్రమే కాదు, మనసులోని ఒత్తిడిని, కోపాన్ని బయటకు పంపే ఒక మార్గం అని మరి కొందరు అంటున్నారు. మొత్తానికి రిప్లై ఇవ్వని కంపెనీలపై ఆ కుర్రాడు తీర్చుకున్న ఈ వెరైటీ పగ.. ఉద్యోగ వేటలో ఉన్న లక్షలాది మంది యువతకు ఒక రకమైన సంతృప్తిని ఇస్తోంది.
