చూశారా.. మళ్లీ వచ్చా!     

చూశారా.. మళ్లీ వచ్చా!     

లోక్​సభ ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో ఆగిపోయిన మన్​ కీ బాత్​ కార్యక్రమం తిరిగి ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. ‘‘కొద్ది నెలల్లోనే మళ్లీ కలుస్తానని ఫస్ట్​ ఎడిషన్​ చివరి ఎపిసోడ్​లో చెప్పాను. నేనలా మాట్లాడటం చాలా మందికి రుచించలేదు. నాది ఓవర్​ కాన్ఫిడెన్స్​ అని ప్రతిపక్షాలు విమర్శించాయి. నేను మాత్రం ప్రజల్నే నమ్మాను. వాళ్లు కూడా తమకు నమ్మకమైన ప్రభుత్వాన్నే రెండోసారి ఎన్నుకున్నారు. నన్ను మళ్లీ ప్రధానిగా ఎన్నుకున్నందుకు అందరికీ థ్యాంక్స్​.

ఎన్నికలు సక్సెస్​ కావడంలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం ఉంది. 61 కోట్ల మంది తమ ఓటు హక్కుని వాడుకుని డెమోక్రసీకి కొత్త అర్థం చెప్పారు​”అని అన్నారు. ఆలిండియా రేడియో ద్వారా ఆదివారం ‘మన్​ కీ బాత్​’ కార్యక్రమంలో  మాట్లాడిన ఆయన, దేశవ్యాప్తంగా నీళ్ల కరువు, గ్రౌండ్​ వాటర్ తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కురుస్తున్న వర్షాల్లో కేవలం 8 శాతం నీటిని మాత్రమే రీసైకిల్ చేసుకోగలుగుతున్నామని, అది మరింత పెరగాల్సిన అవసరముందన్నారు. కలిసికట్టుగా ప్రయత్నించినప్పుడే వాటర్​ క్రైసిస్​ను అధిగమించగలమని చెప్పారు.

రెండో ఎడిషన్​ మన్​ కీ బాత్​ మొదటి ఎపిసోడ్​ సందర్భంగా బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని సిటీలు, టౌన్లలో టెంట్లు, మైకులు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని కర్కాలా స్టేడియంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ చీఫ్​ అమిత్​ షా పార్టీ నేతలతో కలిసి ‘మన్​ కీ బాత్​’ విన్నారు.

వాటర్​ మూమెంట్​..

స్వచ్ఛభారత్​ తరహాలో నీటి సంరక్షణ కోసం మాస్​ మూమెంట్​ మొదలుపెడదామంటూ ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి నీటి బొట్టునూ కాపాడుకుందామని, రెయిన్‌‌ వాటర్‌‌ హార్వెస్టింగ్​ను మెరుగుపర్చుకుందామన్నారు.

జనం తల్చుకుంటే సాధ్యమే..

“నీళ్లు దేవుడిచ్చిన వరం. వాటిని కాపాడుకోవటం మనందరి బాధ్యత. నీళ్లని ఆదా చేయడానికి ప్రత్యేకమైన పద్ధతంటూ లేదు. ఒక్క ప్రాంతంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు. నీళ్లను పొదుపుగా వాడుదాం. ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసిపడదాం. జనం తల్చుకుంటే సాధ్యంకానిదంటూ ఏదీ ఉండదు. అందుకే ‘జనశక్తితో జలశక్తి’ నినాదంతో ముందుకెళదాం. ప్రభుత్వ సంస్థల నుంచి ఎన్జీవోలా దాక,  సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ వాటర్​ కన్జర్వేషన్​ మూమెంట్​లో పాలుపంచుకోవాలని కోరుతున్నాను. నీళ్లకు సంబంధించిన అన్ని విభాగాల్ని కలిపి కొత్తగా జలశక్తి మినిస్ట్రీ ఏర్పాటుచేశాం. చిన్నాపెద్దా అందరూ సలహాలు, సూచనల్ని రాసిపంపండి”అని ప్రధాని మోడీ చెప్పారు.