నేను జస్ట్ కార్యకర్తనే.. నితిన్ నబీన్ ఇప్పుడు నా బాస్: ప్రధాని మోడీ

నేను జస్ట్ కార్యకర్తనే.. నితిన్ నబీన్ ఇప్పుడు నా బాస్: ప్రధాని మోడీ

బీజేపీ: తాను బీజేపీ సాధారణ కార్యకర్తనని.. నితిన్ నబీన్ ఇప్పుడు నా బాస్ అని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ మంళవారం (జనవరి 20) బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడైనందుకు నితిన్ నబిన్‌ను అభినందిస్తున్నానని అన్నారు. తాను దేశానికి ప్రధాన మంత్రిని అయినప్పటికీ.. పార్టీ విషయానికి వస్తే సాధారణ కార్యకర్తనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

నితీన్ నబీన్ ఇప్పుడు నా బాస్ అని తనదైన శైలీలో మోడీ చమత్కరించారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించిన నబీన్ క్రమశిక్షణ, నిబద్ధతతో నిర్వర్తించాడని.. తనను తాను నిరూపించుకుని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని ప్రశంసించారు. రాబోయే 25 సంవత్సరాలు ఇండియా భవిష్యత్‎కు చాలా ముఖ్యమని.. ఈ కీలక దశలో నితిన్ నబిన్ బీజేపీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నబీన్ దేశంలో ఆర్థిక, సామాజిక, సాంకేతిక మార్పులను చూసిన తరానికి చెందిన వ్యక్తి అని.. అతను రేడియో వింటూ పెరిగాడు.. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడని పేర్కొన్నారు. 

సున్నా నుంచి ఉన్నత స్థాయికి:

అటల్ జీ, అద్వానీ జీ, మురళీ మనోహర్ జోషి జీ నాయకత్వంలో బీజేపీ సున్నా నుంచి ఉన్నత స్థాయికి చేరుకుందని పార్టీ చారిత్రాత్మక ఎదుగుదలను ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ సహా పలువురు సీనియర్ నాయకులు బీజేపీని అంచెలంచెలుగా విస్తరించారని పేర్కొన్నారు. రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వంలో బీజేపీ తొలిసారిగా సొంతంగా పూర్తి మెజారిటీని సాధించిందని తెలిపారు. 

ఆ తర్వాత అమిత్ షా లీడర్ షిప్‎లో బీజేపీ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇక.. జెపీ నడ్డా నాయకత్వంలో బీజేపీ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు క్షేత్రస్థాయిలో బలపడిందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ అధ్యక్షులందరి మోడీ ధన్యవాదాలు తెలిపారు.