బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు..

బీజేపీ  జాతీయ అధ్యక్షుడిగా  నితిన్ నబిన్ బాధ్యతలు..

 బీజేపీ  జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్  జనవరి 20న  అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు . ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న జెపి నడ్డా స్థానంలో 45 ఏళ్ల నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ  ప్రధాన కార్యాలయంలో  జరిగిన ఈ కార్యక్రమానికి  ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా  మాట్లాడిన మోదీ. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరని చెప్పారు. గతంలో అద్వానీ,వెంకయ్యనాయుడు నేతృత్వంలో అద్భుత విజయాలు సాధించామన్నారు.  ప్రజాస్వామ్యపరంగా  బీజేపీలో నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. అందరి కృషితో మూడోసారి అధికారంలోకి వచ్చామన్నారు.  దేశ సేవ, ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందని..  గ్రామస్థాయి నుంచి  జాతీయ స్థాయి వరకు బీజేపీ పటిష్టంగా ఉందన్నారు .  బీజేపీలో కష్టపడే వారికి  పదవులు వెతుక్కుంటూ వస్తాయన్నారు మోదీ.  

నితిన్ నబిన్ ఎవరు?

బీహార్ సీనియర్ పొలిటిషియన్, దివంగత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కొడుకే నితిన్ నబీన్. కాయస్త కమ్యూనిటీకి చెందిన ఆయన.. ఇప్పటివరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006లో ఆయన తండ్రి నవీన్ కిశోర్ మరణంతో పాట్నా వెస్ట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికకు బీజేపీ అధిష్టానం నితిన్‎ను బరిలోకి దింపగా ఆయన ఘన విజయం సాధించారు. ఆ తరువాత బంకిపూర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు నితిన్ నబిన్. ఇటీవలే బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‎గా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026లో వెస్ట్ బెంగాల్, తమిళనాడు వంటి కీలకమైన రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆయన పనితనానికి సవాల్ విసరనున్నాయి.

అతి పిన్నవయస్కుడిగా...

ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన నబిన్.. 46 ఏండ్ల వయసులోనే బీజేపీకి 12 వ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దాంతోఈ పదవికి ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా నబిన్ రికార్డు సృష్టించారు. అలాగే.. బిహార్ నుంచి పార్టీ అధ్యక్ష స్థాయికి ఎదిగిన  తొలి నేతగా నిలిచారు. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబిన్.. తండ్రి మరణం తర్వాత 2006 లో పాట్నా వెస్ట్ నుంచి బై ఎన్నికలో గెలిచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి 2010, 2015, 2020, 2025(తాజాగా) వరుసగా బాంకిపుర్ స్థానాన్ని నిలుపుకున్నారు.నబిన్.. పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు. గతంలో బీజేపీ యువ మోర్చా(బీజేవైఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేవైఎం బిహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.