తమిళనాడు భవిష్యత్తుకు డీఎంకే శత్రువు: మోదీ

తమిళనాడు భవిష్యత్తుకు డీఎంకే శత్రువు:  మోదీ

కన్యాకుమారి: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ రాష్ట్ర భవిష్యత్తుకు శత్రువని అభివర్ణించారు. దేశం, వారసత్వ సంస్కృతిపై డీఎంకే ద్వేషాన్ని నింపుకున్నదని దుయ్యబట్టారు. శుక్రవారం కన్యాకుమారిలో నిర్వహించిన సభ​లో మోదీ మాట్లాడారు. యూపీఏ హయాంలో డీఎంకే కీలకంగా వ్యవహరించిందని, ఆ సమయంలో కన్యాకుమారిలో అభివృద్ధికి ఆ పార్టీ చేసిందేమీ లేదన్నారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లతోపాటు ఇతర అభివృద్ధి పనులు వేగంగా జరిగాయని చెప్పారు. అన్నాడీఎంకేకు మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. దివంగత సీఎం జయలలితపట్ల డీఎంకే ఎలా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో నేటికీ అదే సంస్కృతి కొనసాగుతున్నదని, మహిళలపై నేరాలు పెరిగాయని ఆరోపించారు.

2జీ స్కాంలో డీఎంకేకు భారీ లబ్ధి

ఇండియా కూటమి అంటేనే స్కామ్​లని, కోట్లాది రూపాయలు దోచుకున్నారని మోదీ మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి మాత్రం సంక్షేమ పథకాలతో ప్రజలకు సుపరిపాలన అందించిందని తెలిపారు. ‘డీఎంకే చరిత్రంతా దోపిడీనే. ప్రజలను దోపిడీ చేసేందుకే డీఎంకే అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. బీజేపీ అంటే స్కీములు... ఇండియా కూటమి అంటే స్కామ్​లు. మేం ఆప్టికల్​ ఫైబర్​, 5జీ తెస్తే.. ఇండియా కూటమి 2జీ స్కామ్​ తెచ్చింది.’  అని మోదీ చురకలంటించారు. 2జీ స్కాంలో డీఎంకే భారీ లబ్ధి పొందిందని, ఈ స్కాంలో డీఎంకే నేత, టెలికాం మాజీ మంత్రి ఏ రాజా చిక్కుకున్నారని, ఆపై కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసిందని గుర్తుచేశారు. 

బీజేపీ సర్కారు ఉడాన్​లాంటి స్కీంలు తెచ్చి ఎయిర్​పోర్టులు నిర్మిస్తే.. ఇండియా కూటమి మాత్రం చాపర్​ స్కాం చేసి దేశ భద్రతతోనే ఆటలాడిందని, బొగ్గు స్కాంతో అవినీతి మరకలు అంటించుకొన్నదని తెలిపారు. ఇండియా కూటమి స్కాంల లిస్ట్​ చాలా పెద్దదని.. ఇది ఆ కూటమి అసలు స్వరూపమని ఎద్దేవా చేశారు. పార్లమెంట్​లో మహిళా బిల్లు పెట్టినప్పుడు డీఎంకే, కాంగ్రెస్​ మద్దతివ్వలేదని ఆ రెండూ మహిళా వ్యతిరేక పార్టీలని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల దురహంకారాన్ని అణచివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.