రైతుల కోసం మీరేం చేశారు? .. శరద్ పవార్ పై ప్రధాని మోదీ ఫైర్

రైతుల కోసం మీరేం చేశారు? ..  శరద్ పవార్ పై ప్రధాని మోదీ ఫైర్

అహ్మద్​నగర్/పణజి: యూపీఏ హయాంలో రైతుల కోసం ఏమీ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అప్పటి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పని చేసిన ఎన్ సీపీ చీఫ్ శరద్ పవార్ పైనా ఆయన ఫైర్ అయ్యారు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. 

గురువారం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో పలు అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. ముందుగా ఢిల్లీ నుంచి మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి నేరుగా షిర్డీ ఆలయానికి చేరుకున్నారు. సాయిబాబాను దర్శించుకుని పూజలు నిర్వహించారు. మోదీతో పాటు మహారాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్, సీఎం ఏక్​నాథ్​ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. పూజల అనంతరం ఆలయ కొత్త క్యూ కాంప్లెక్స్​ను ప్రధాని ప్రారంభించారు. రూ.112 కోట్లతో నిర్మించిన కొత్త కాంప్లెక్స్ లో 10 వేల మంది భక్తులు కూర్చునేందుకు వీలుకానుంది.  

నీల్వాండే డ్యామ్‌ ఎడమ కాలువ ప్రారంభం 

అహ్మద్‌నగర్ జిల్లాలో నీల్వాండే డ్యామ్‌ ఎడమ కాలువను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 85 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ ద్వారా 182 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రూ.5,177 కోట్లతో ఈ ప్రాజెక్ట్​ను అభివృద్ధి చేస్తున్నారు. అనంతరం నమో షెత్కారీ మహాసన్మాన్ నిధి పథకాన్ని మోదీ ప్రారంభించారు. 

ఇది మహారాష్ట్రలోని 86 లక్షల మంది లబ్ధిదారులకు ఏడాదికి రూ.6 వేల అదనపు ఆదాయాన్ని అందించనుంది. హెల్త్, రైల్వే, రోడ్డురవాణా, గ్యాస్ వంటి రంగాలకు సంబంధించిన రూ.7500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పీఎం శంకుస్థాపన చేశారు. 

థాక్రే కలను మోదీ నెరవేర్చారు: ఏక్​నాథ్ షిండే 

అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ద్వారా శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే  కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. షిర్డీలో ప్రధాని మోదీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.