పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను వణికించిన సమయంలో భారత్ ఎలా సంక్షోభాన్ని ఎదుర్కొందో ప్రధాని మోడీ వివరించారు. అమెరికా ఇజ్రాయెల్ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తినా, తాము సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారత ప్రజలపై భారీ భారం పడకుండా కాపాడినట్లు మోడీ అన్నారు. ముఖ్యంగా వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2వేలకు చేరుకునే ప్రమాదాన్ని నివారించగలిగామన్నారు.
యుద్ధంతో హోర్ముజ్ జలసంధి ప్రభావితమవడంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ సరఫరా దెబ్బతిందని మోడీ చెప్పారు. ముడి చమురు ధరలు బ్యారెల్కు 70 డాలర్ల నుంచి 120 డాలర్లకు పెరిగాయని.. అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయని గుర్తు చేశారు. కొన్ని దేశాలు ఇంధనాన్ని రేషన్ విధానంలో పంపిణీ చేసే పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ, భారత్లో ఒక్కరోజు కూడా అలాంటి పరిస్థితి రాలేదని పేర్కొన్నారు.
గ్యాస్ సిలిండర్ రూ.2వేలు కాకుండా ఎలా ఆపారు?
భారత్కు అవసరమైన ఎల్పీజీలో దాదాపు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుందని, అందులో 90 శాతం హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే వచ్చేదని మోడీ తెలిపారు. యుద్ధం కారణంగా ఈ మార్గం దెబ్బతినడంతో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం కనిపించిందన్నారు. వెంటనే ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సరఫరాను పరిమితం చేయడం, రిఫైనరీల్లో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడం, ఇంతకుముందు ఎల్పీజీ తయారు చేయని రిఫైనరీలను కూడా కేవలం 7 రోజుల్లో మార్పులు చేసి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
PNGతో కూడా ఒత్తిడి తగ్గింపు
ఎల్పీజీపైనే పూర్తిగా ఆధారపడకుండా.. పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లను వేగంగా విస్తరించామన్నారు. చాలా తక్కువ సమయంలోనే 11 లక్షలకు పైగా కుటుంబాలకు కొత్త PNG కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. ఈ చర్యల వల్ల మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లుగా గ్యాస్ సిలిండర్ ధర రూ.2వేలకు చేరకుండా నిలువరించగలిగామని, ప్రస్తుతం కూడా డొమెస్టిక్ సిలిండర్ రూ.950లోపే అందుబాటులో ఉందని వివరించారు.
ALSO READ : జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ప్రజలపై రూ.75 వేల కోట్ల భారం పడనివ్వలే..
ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై రూ.75 వేల కోట్లకు పైగా నష్టాన్ని భరించాల్సి వచ్చిందని తెలిపారు. ఆ భారాన్ని ప్రభుత్వం భుజాన వేసుకుందని, ప్రజలపై అదనపు భారం పడకుండా లీటర్కు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని కూడా తగ్గించినట్లు చెప్పారు.
దౌత్యమే భారత్కు బలం..
యుద్ధానికి ముందు భారత్ కేవలం 25–26 దేశాల నుంచి మాత్రమే ఇంధనం దిగుమతి చేసుకునేదని, సంక్షోభ సమయంలో దౌత్యపరమైన ప్రయత్నాల వల్ల 40కిపైగా దేశాల నుంచి ఇంధనాన్ని సమీకరించగలిగామని మోడీ వెల్లడించారు. దేశ ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చామన్నారు. సంక్షోభం ఎంత పెద్దదైనా, కొత్త భారత్ వెనక్కి తగ్గదని, సరైన నిర్ణయాలతో ప్రతి సవాలును అధిగమిస్తుందని మోడీ స్పష్టం చేశారు. మెుత్తానికి తన సమయస్పూర్తి నిర్ణయాలు దేశాన్ని పెద్ద కష్టం నుంచి ఒడ్డుకు చేర్చాయని ప్రధాని మోడీ వెల్లడించారు.
