
- దేశ ఐక్యతను ప్రపంచం మొత్తం చూసింది: మోదీ
- 22 నిమిషాల్లోనే టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశాం
- ప్రపంచం చూపంతా మేడిన్ ఇండియా ఆయుధాల వైపే
- పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ప్రధాని
- సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలన్న రాహుల్ గాంధీ
- తొలి రోజే ఉభయ సభల్లో వాయిదాల పర్వం
- ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు
- 16 గంటల డిబేట్‌కు బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఓకే
- వచ్చే వారం ప్రారంభించే అవకాశం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్తో దేశ ఐక్యతను ప్రపంచం మొత్తం చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో చూపించామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో వంద శాతం లక్ష్యాలను సాధించామని, కచ్చితమైన లక్ష్యంతో కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్, పీవోకేలోని టెర్రరిస్ట్ క్యాంపులను నామ రూపాల్లేకుండా చేశామని చెప్పారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన మేడిన్ ఇండియా ఆయుధాల గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
చాలా దేశాలు మన వెపన్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్తో మేడిన్ ఇండియా ఆయుధాల సామర్థ్యం, గొప్పతనం ఏంటో ప్రపంచ దేశాలన్నీ చూశాయి. ఈ మధ్య కాలంలో నేను ఎవరిని కలిసినా మేడిన్ ఇండియా ఆయుధాల గురించే మాట్లాడుతున్నారు. ఇదే ఐక్యతను పార్లమెంట్‌లోని సభ్యులందరూ చూపించాలి. ఆయా పార్టీల ఎజెండాలు, సిద్ధాంతాల కోసం మనసులు కలవకపోయినా.. దేశ హితం కోసం అందరూ ఒక్కటిగా నడవాలి. ఈ సమావేశాలు దేశప్రగతికి ఒక విజయోత్సవంగా ఉండాలి’’అని ప్రధాని మోదీ అన్నారు.
మన ఎంపీలంతా పాక్ దుశ్చర్యను ఎండగట్టారు
పహల్గాం టెర్రర్ అటాక్.. ప్రపంచం మొత్తాన్ని షాక్‌కు గురి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌పై మన ఎంపీలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటించి వివరించారు. పాక్ దుష్ట చర్యలను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టారు. ఎంపీలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అంశం.. దేశవ్యాప్తంగా పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. తుపాకులు, బాంబుల ముందు మన రాజ్యాంగం బలంగా నిలబడింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని వేడుక చేసుకోవాలి’’ అని మోదీ అన్నారు.
ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నదని తెలిపారు. ‘‘దేశం సరైన దిశలో పురోగమిస్తున్నది. ఈ సమావేశాలు ఆ దిశను మరింత బలోపేతం చేస్తాయి. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్)లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఇది దేశానికి గర్వకారణం. శుభాంశు శుక్లా స్పేస్ జర్నీ సక్సెస్ అయింది. టెర్రరిజం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి’’ అని మోదీ అన్నారు.
మంత్రులు సముదాయించినా పట్టించుకోలే
మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం అయ్యాక.. డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోలేదు. తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో డిమాండ్లు చెప్పాలని సూచించారు. అయినా సభ్యులు పట్టించుకోకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైనా.. అదే పరిస్థితి ఉండటంతో 4 గంటలకు వాయిదా వేశారు. ప్రతిపక్షాలు నిరసనలు ఆపకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ఓకే
ఆపరేషన్ సిందూర్, పహల్గాం టెర్రర్ అటాక్‌పై 16 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వచ్చేవారం ఈ డిస్కషన్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే, ఈ వారంలోనే చర్చ ప్రారంభించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రధాని మోదీ జవాబు చెప్పాలని పట్టుబట్టాయి. రక్షణ, హోంశాఖ మంత్రులు కూడా ఉండాలని కోరాయి. అయితే, ఈ వారంలోలో ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో వచ్చేవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. కాగా, ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటు న్న జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని కోరుతూ.. ఉభయ సభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని ఇచ్చారు. స్పీకర్ ఓం బిర్లాకు ఈమేరకు 145 మంది ఎంపీలు తమ పిటిషన్ సమర్పించారు. రాజ్యసభలో 63 మంది ఎంపీలు నోటీసులు సమర్పించారు.