లక్నో: శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామ భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమం ముగిసింది. 2025, నవంబర్ 25 మంగళవారం కన్నుల పండుగగా జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా శ్రీ రామ జన్మభూమి ఆలయ శిఖరంపై ప్రధాని మోడీ భగవా(కాషాయ) జెండాను ఎగురవేశారు. పవిత్రమైన అభిజిత్ ముహూర్తంలో జెండాను ఆవిష్కరించారు.
వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య రాములోరి కాషాయ జెండా పైకి ఎగిరి రెపరెపలాడింది. ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు రామ భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు తరలివచ్చారు. ప్రధాని మోడీ కాషాయ జెండా ఆవిష్కరిస్తోన్న సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య దద్దరిల్లింది. అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయిన దానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.
ప్రధాని మోడీ ఆవిష్కరించిన పది అడుగుల ఎత్తు, ఇరవై అడుగుల పొడవు ఉన్న ఈ త్రిభుజాకార భగవా జెండా మీద సూర్యుడు, ఓం, కోవిదార వృక్షం చిత్రాలు ఉంటాయి. ఇది రాముడి తేజస్సు, వీరత్వాన్ని సూచిస్తుంది. గౌరవం, ఐక్యత, సాంస్కృతిక కొనసాగింపును ఈ జెండా తెలియజేస్తుందని ప్రధాని కార్యాలయం తెలిపింది.
శ్రీరామ జన్మభూమి రామాలయ ధ్వజారోహణ కార్యక్రమానికి అయోధ్యకు వచ్చిన ప్రధాని మోడీ ముందుగా రామ మందిర్ కాంప్లెక్స్‌లోని సప్తమందిర్, శేషావతార్ మందిర్, అన్నపూర్ణ మందిర్‌లను దర్శించుకున్నారు. అనంతరం రామ్ లల్లా గర్భగుడిలో పూజలు చేశారు. ఆ తర్వాత రామ్ లల్లా ఆలయ శిఖరంపై కాషా జెండా ఎగురవేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సాధువులు, ప్రముఖులు, రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
