
న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శుక్రవారం (మే 9) రాత్రి పాక్ ఒక్కసారిగా పాక్ దాడులకు తెగబడటంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధులతో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. తాజాగా పాక్ చేస్తోన్న దాడులపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను ప్రధాని మోడీకి వివరించారు. సరిహద్దులో జరుగుతోన్న దాడుల గురించి మోడీ ఆరా తీశారు. మరోవైపు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో సీఎంలతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
కాగా, భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాక్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగౌమ్, సాంబా, తంగదార్, సెక్టర్లలోని భారత సైనిక స్థావరాలపై శుక్రవారం (మే 9) మళ్లీ కాల్పులకు తెగబడింది. ఓ వైపు కాల్పులు చేస్తూ.. మరోవైపు సరిహద్దులోని పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. సాంబా సెక్టర్, పోఖ్రాన్, ఫిరోజ్పూర్, పంజాబ్లోని పఠాన్ కోట్లో పాక్ డ్రోన్ దాడులకు పాల్పడగా.. వెంటనే అప్రమత్తమైన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గాల్లోని ధ్వంసం చేసింది.
పాక్ దాడుల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జమ్మూతో పాటు పలు ప్రాంతాల్లో మళ్లీ వార్ సైరన్లు మోగాయి. పాక్ సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు. పాక్ దాడులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది. ఓ వైపు పాక్ ఆర్మీ కాల్పులు తిప్పికొడుతూ.. మరోవైపు గగనతల రక్షణ వ్యవస్థతో పాక్ డ్రోన్లను తునాతునకలు చేస్తోంది. దీంతో మరోసారి ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.