నౌకలకు ఇబ్బంది కలగొద్దు : ప్రధాని నరేంద్ర మోదీ

నౌకలకు ఇబ్బంది కలగొద్దు :  ప్రధాని నరేంద్ర మోదీ
  • ఒమన్, ఫ్రాన్స్, మలేషియా దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్​

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో గురువారం విడివిడిగా ఫోన్​లో మాట్లాడారు. హోర్ముజ్ జలసంధి భద్రత, ఆ ప్రాంతంలో శాంతి స్థాపనపై చర్చలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అయ్యే హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకూడదన్నారు. అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడంలో ఒమన్ పోషిస్తున్న పాత్రను ప్రధాని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు సహకరిస్తున్నందుకు సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌‌‌‌‌‌‌‌తో చర్చించారు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని ఇరు నేతలు అంగీకరించారు. యుద్ధం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని పునరుద్ఘాటించారు.

ప్రపంచ దేశాలకు ఇది పరీక్షా సమయం: కేంద్రం 

పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులు ఇండియాతో పాటు ప్రపంచానికి పరీక్షా సమయం అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైస్వాల్‌‌‌‌‌‌‌‌ అన్నారు. దేశ ఇంధన భద్రత అవసరాలను తీర్చుకోవడానికి తాము సంబంధిత దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత సవాళ్లు తమ దౌత్యానికి పరీక్షా సమయమన్నారు. ప్రధాని మోదీ కువైట్ క్రౌన్‌‌‌‌‌‌‌‌ ప్రిన్స్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడారని, అలాగే, పలువురు ప్రపంచ అధినేతలతో కూడా తాము సంప్రదింపులు కొనసాగిస్తున్నామని తెలిపారు.