దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించిన మోదీ

దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించిన మోదీ

దేశంలోనే అత్యంత పొడవైన  సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)ను   ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించారు.  ఈ వంతెన ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవసేవను కలుపుతుంది. ఈ వంతెన పొడవు 21.8 కి.మీ. కాగా, ఇందులో 16.5 కి.మీ. అరేబియా సముద్రంపైనే ఉంటుంది. ఈ వంతెనను రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించారు. 

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీద నిర్మించిన అటల్ సేతు ముంబయి నుంచి నవీ ముంబయిల మధ్య  జర్నీ సమయాన్ని తగ్గిస్తోంది.అంతేగాకుండా ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది.రవాణాను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా ఆర్థిక వృద్ధికి ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

2 గంటల జర్నీ.. 20 నిముషాల్లోనే 

సేవ్రీ నుంచి నవా షేవాకు ప్రస్తుతం 2 గంటల సమయం పడుతుండగా ఈ వంతెనపై నుంచి 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లకు ఈ వంతెనపై అనుమతి లేదు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు ప్రయాణించవచ్చు. వంతెనపై రోజూ 70 వేలకు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శీతాకాలంలో ఇక్కడికి వలస వచ్చే ప్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనపై సౌండ్ బారియర్ ఏర్పాటు చేశారు. సముద్రపు జీవులకు హాని కలిగించని లైట్లను డిజైన్ చేసి వంతెనపై అమర్చారు.