
దేశీయ పాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ వార్షిక పాల ఉత్పత్తి వృద్ధి.. ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందన్నారు. గత 8 ఏళ్లలో పాల ఉత్పత్తిలో 44 శాతం వృద్ధి జరిగిందని చెప్పారు. గ్రేటర్ నోయిడాలో ఇవాళ జరిగిన ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడారు.
2014 నుంచి దేశ పాడి పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతో కృషి చేశామని ఆయన తెలిపారు. దీని ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. దేశంలో ప్రస్తుతం 210 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. 8 కోట్ల కుటుంబాలు పాల ఉత్పత్తి మీద ఆధారపడి ఉన్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Speaking at inauguration of International Dairy Federation World Dairy Summit 2022 in Greater Noida. https://t.co/yGqQ2HNMU4
— Narendra Modi (@narendramodi) September 12, 2022
పశువుల్లో ప్రబలుతున్న లంపీ చర్మ వ్యాధికి స్వదేశీ వ్యాక్సిన్ ను భారత్ అభివృద్ధి చేసిందని ప్రధాని మోడీ ఈసందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆ వ్యాక్సిన్ ప్రీ మార్కెట్ దశలో ఉందని, విస్తృతంగా దేశంలో అందుబాటులోకి వచ్చేందుకు ఇంకొంత సమయం పడుతుందని వెల్లడించారు. దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో లక్షలాది పశువులకు లంపీ చర్మవ్యాధి సోకిందని, దాని కారణంగా వందలాది జీవాలు మృత్యువాత పడ్డాయని మోడీ తెలిపారు.