దేశ భవిష్యత్తుకు ఈ లోక్‌‌సభ ఎన్నికలు కీలకం : నరేంద్ర మోదీ

దేశ భవిష్యత్తుకు ఈ  లోక్‌‌సభ  ఎన్నికలు కీలకం : నరేంద్ర మోదీ
  • చివరిదాకా శ్రమించండి 
  • ఓటర్లకు మరింత చేరువవ్వండి

న్యూఢిల్లీ:  ఈసారి జరిగే లోక్‌‌సభ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని.. ఓటర్లకు మరింత చేరువ అవ్వాలని బీజేపీ అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బుధవారం ఆయన లోక్‌‌సభ ఎన్నికల తొలి దశలో పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ వ్యక్తిగతంగా లెటర్స్ రాశారు. మొదటి విడత ఎన్నికల ప్రచారానికి ఉన్న చివరి కొన్ని గంటలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. తన సందేశాన్ని పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేయాలని సూచించారు. దేశ వర్తమానాన్ని భవిష్యత్తుతో అనుసంధానించడానికి ఈ ఎన్నికలు ఓ అవకాశమని తన లేఖల్లో  పేర్కొన్నారు. మనం పొందే ప్రతి ఓటు  దేశంలో బలమైన ప్రభుత్వ ఏర్పాటుకు, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుందన్నారు. 

తన సమయాన్ని ప్రతి క్షణం దేశ పౌరుల సంక్షేమానికే అంకితం చేస్తానని..ఈ హామీని ప్రతి ఓటరుకు తెలియజేయాలని అభ్యర్థులకు సూచించారు. ప్రణాళికతో ముందుకు వెళ్లితే అభ్యర్థులందరికీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు కూడా మోదీ రిక్వెస్ట్ చేశారు. వేడిగాలులు వీయకముందే ఉదయాన్నే ఓట్లు వేయాలని కోరారు. 

మోదీ లేఖపై అభ్యర్థుల హర్షం 

తమకు మోదీ లేఖను పంపినట్లు బీజేపీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు, కోయంబత్తూరు అభ్యర్థి కే.అన్నామలై, ఉత్తరాఖండ్‌‌లోని పౌరీ నుంచి పోటీ చేస్తున్న పార్టీ ప్రధాన ప్రతినిధి అనిల్ బలూనీకి గర్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి తన సందేశాన్ని ప్రాంతీయ భాషల్లో  చెప్పడంపై దృష్టి పెట్టడాన్ని హర్షం వ్యక్తం చేశారు. అన్నామలైకి ఇంగ్లీషులో, అనిల్ బలూనీకి హిందీలో మోదీ లెటర్స్ రాశారు.

 అన్నామలై గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన మోదీ.. రాజకీయాల్లో చేరేందుకు  ఐపీఎస్ ఉద్యోగాన్నివిడిచిపెట్టిన అన్నామలైకి అభినందనలు తెలిపారు. బీజేపీ నాయకుడిగా అనిల్ బలూనీ కృషిని పొగిడిన మోదీ..రాజ్యసభ సభ్యుడిగా ఉత్తరాఖండ్ సమస్యలను పరిష్కారించారని ప్రశంసించారు. కాగా..21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 స్థానాలకు శుక్రవారం(ఏప్రిల్ 19న) మొదటి విడత పోలింగ్ జరగనుంది.