లోక్​సభ ఎన్నికల ప్రచారానికి.. బీహార్ నుంచి మోదీ శ్రీకారం

లోక్​సభ ఎన్నికల ప్రచారానికి..  బీహార్ నుంచి మోదీ శ్రీకారం

న్యూఢిల్లీ: లోక్​సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ హైకమాండ్ సిద్ధమవుతోంది. ఈ నెల 13న బీహార్ లో పర్యటించనున్న ప్రధాని మోదీతో ప్రచారానికి శ్రీకారం చుట్టించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చంపారన్​ పర్యటనలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించనున్నారు. ఆ తర్వాత బెట్టయ్య సిటీలో భారీ ర్యాలీతో లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీహార్​లోని మొత్తం 40 స్థానాలను గెల్చుకోవడమే లక్ష్యంగా ప్రచార షెడ్యూల్ రూపొందిస్తున్నారు. బహిరంగ సభలతో పాటు రోడ్ షో, ర్యాలీలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరిలో మోదీతో పాటు హోంమంత్రి అమిత్​ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ప్రచారం నిర్వహించనున్నట్లు బీజేపీ బీహార్ నేతలు చెబుతున్నారు. బెగుసరాయ్, బెట్టయ్య, ఔరంగాబాద్​లో నిర్వహించే ర్యాలీల్లో మోదీతో పాటు కీలక నేతలు ర్యాలీలలో పాల్గొంటారని చెప్పారు.

బీహార్​పై బీజేపీ స్పెషల్ ఫోకస్

జనవరి, ఫిబ్రవరిలో సితామరాహి, మాధేపురా, నలందలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. జేపీ నడ్డా కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేపట్టే ఎన్నికల ప్రచారానికి హాజరవుతారు. ప్రధానంగా సీమాంచల్, బీహార్​లోని ఈస్ట్రన్ రీజియన్​పై నడ్డా ఫోకస్ పెట్టనున్నారు. ప్రస్తుతం జేడీయూ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బీహార్​లో అధికారంలో ఉంది. మహాఘట్ బంధన్ ప్రభుత్వంలో ఒకప్పుడు బీజేపీతో కలిసి జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ఎన్​డీఏ నుంచి బయటికొచ్చిన జేడీయూ.. ఆర్జేడీతో కలిసి సర్కార్ ఏర్పాటు చేసింది. బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న పలు పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. కూటమి ఏర్పాటులో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ బీహార్​లోని మొత్తం 40 స్థానాలకు 39 సీట్లను గెల్చుకుంది. ఈసారి 40 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహం రచిస్తున్నది.