- ఇరువురు నేతలతో గంటకుపైగా భేటీ
- పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ
- ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఏపీ అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై చర్చ!
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. హెచ్ఐసీసీ లో పోగ్రాం అనంతరం తొలుత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కల్యాణ్‌కు ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ చేరుకొని, ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీకి చంద్రబాబు కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. ప్రధాని రాకను తమ కుటుంబానికి దక్కిన గొప్ప గౌరవంగా, చిరస్మరణీయ క్షణంగా చంద్రబాబు , పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తమ ఇంటికి వస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఇరువురు నేతలు ఆదివారం ట్వీట్ చేశారు.
రాజకీయాలు, అభివృద్ధిపై చర్చ
ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఏపీ అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం లాంటి కీలక అంశాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించినట్టు తెలుస్తున్నది. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో.. కేంద్ర, -రాష్ట్రాల మధ్య సమన్వయం, విభజన హామీల అమలుపై ప్రధానంగా డిస్కస్ చేసినట్టు సమాచారం. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా విభజన సమస్యలు, ఇరిగేషన్ అంశాలపై కేంద్ర హోం శాఖ, జలశక్తి శాఖ మంత్రులను కలవనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రధాని, ఏపీ సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది.
