సౌదీ అరేబియా యువరాజుతో మోదీ భేటీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు

సౌదీ అరేబియా యువరాజుతో మోదీ భేటీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు

సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్.. భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. వీరి మధ్య వాణిజ్యం, ఆర్థికం, రక్షణ, సాంస్కృతిక సహకారంపై ప్రధాన చర్చ జరిగింది. 2019లో మోదీ.. సౌదీ అరేబియాకి వెళ్లినప్పుడే ఈ కౌన్సిల్ సమావేశంపై చర్చ జరిగింది. తాజాగా ఈ భేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి.

"భారతదేశం కోసం, సౌదీ అరేబియా దాని సన్నిహిత, అతిపెద్ద వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటిగా పరిగణించబడుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు. "స్థిరత, ప్రాంతం, ప్రపంచ సంక్షేమం కోసం భారతదేశం-సౌదీ అరేబియా భాగస్వామ్యం కీలకం" అని చెప్పుకొచ్చారు. "మారుతున్న కాలానికి అనుగుణంగా మేము మా సంబంధాలకు కొత్త కోణాన్ని జోడిస్తున్నాము. మా సన్నిహిత భాగస్వామ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి అనేక కార్యక్రమాలను చేపడతాం" అని అన్నారు.

"భారత్‌కు రావాడం చాలా సంతోషంగా ఉంది. G20 సదస్సుని విజయవంతంగా నిర్వహించిన భారత్‌కి అభినందనలు. ఈ సమావేశాల ద్వారా కీలక ప్రకటనలు చేసే అవకాశం దక్కింది. రెండు దేశాల భవిష్యత్‌ మెరుగ్గా ఉండేలా భారత్‌తో కలిసి పని చేసేందుకు సౌదీ అరేబియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది" అని
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ మహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు.

వ్యూహాత్మక భాగస్వామ్య మండలిలోని రాజకీయ, భద్రత, సామాజిక, సాంస్కృతిక సహకార కమిటీ, ఆర్థిక. పెట్టుబడుల సహకార కమిటీ అనే రెండు మంత్రుల కమిటీల పురోగతిని నేతలు అంచనా వేశారు. రాజకీయ, భద్రత, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలతో సహా ద్వైపాక్షిక సంబంధాల వంటి అన్ని అంశాలను కూడా వారు చర్చించారు. అదనంగా, వారు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపైనా పలు చర్చలు చేశారు.