అబుదాబిలో యూపీఐ, రూపే కార్డ్​.. సేవలు ప్రారంభించిన మోదీ

అబుదాబిలో యూపీఐ, రూపే కార్డ్​..  సేవలు ప్రారంభించిన మోదీ

అబుదాబి: ప్రధాని మోదీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు వెళ్లారు. ఆయన మంగళవారం యూఏఈ రాజధాని అబుదాబికి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్​ బిన్ జాయెద్​ అల్​ నహ్యాన్ తో కలిసి యూపీఐ, రూపే కార్డు సేవలను దుబాయ్​లో ప్రారంభించారు. ఇకపై దుబాయ్​లోనూ గూగుల్ పే, ఫోన్ పే ల ద్వారా చెల్లింపులు చేయొచ్చని మోదీ చెప్పారు. బుధవారం దుబాయ్​లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమిట్​లో మోదీ పాల్గొని మాట్లాడతారు. యూఏఈతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్​తో పాటు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్​తో భేటీ అవుతారు. అబుదాబికి బయలుదేరేముందు సోషల్ మీడియా ‘ఎక్స్’లో మోదీ పోస్టు పెట్టారు. యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు ఎదురుచూస్తున్నానని అందులో పేర్కొన్నారు. ‘‘ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్, డిఫెన్స్, సెక్యూరిటీ, ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్.. ఇలా వివిధ రంగాల్లో గత తొమ్మిదేండ్లలో యూఏఈతో మా బంధం బలపడింది. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్​తో మీటింగ్ కు ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు. కాగా, బుధవారం మధ్యాహ్నం మోదీ ఖతార్​కు వెళ్తారు.

అబుదాబిలో హిందూ దేవాలయం.. 

అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించనున్నారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ (బీఏపీఎస్) సంస్థ ఆధ్వర్యంలో 2019లో గుడి నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయం కోసం యూఏఈ ప్రభుత్వం 27 ఎకరాలు కేటాయించింది. ‘‘అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నాను. ఈ గుడి ఇండియా, యూఏఈ మధ్య ఉన్న శాంతిసామరస్యానికి నిదర్శనం” అని మోదీ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. 

గల్ఫ్ దేశాల్లోనే అతిపెద్ద హిందూ టెంపుల్.. 

అబుదాబిలో నిర్మించిన హిందూ దేవాలయం.. గల్ఫ్ దేశాల్లో ఉన్న హిందూ టెంపుల్స్​లోనే అతి పెద్దది. యూఏఈలో మూడు హిందూ టెంపుల్స్ ఉండగా.. అవి మూడు కూడా దుబాయ్​లో ఉన్నాయి. అబుదాబిలో నిర్మించిన గుడి యూఏఈలోనే మొదటి రాతి హిందూ దేవాలయం. దీని నిర్మాణంకోసం మన దేశంలోని రాజస్థాన్ నుంచి పింక్ శాండ్ స్టోన్స్​ను తీసుకెళ్లారు. రాజస్థాన్, గుజరాత్​కు చెందిన శిల్పులు, కార్మికులు గుడి నిర్మాణంలో పాలుపంచుకున్నారు. 700 కంటెయినర్లలో రాజస్థాన్ నుంచి రాళ్లను తీసుకొచ్చినట్టు సూపర్ వైజర్ విశాల్ బ్రహ్మభట్ తెలిపారు. చెక్క పెట్టెల్లో పెట్టి రాళ్లను తెచ్చామని, ఆ చెక్కలను గుడిలో ఫర్నిచర్ తయారు చేసేందుకు వినియోగించామని చెప్పారు. అలాగే ఇండియా నుంచి గంగా, యమునా నదుల పవిత్ర జలాలను పెద్ద పెద్ద కంటెయినర్లలో తెప్పించామని పేర్కొన్నారు. ఆ జలాలు గుడికి రెండువైపులా ప్రవహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. గంగా జలాలు ప్రవహించే చోట వారణాసి ఘాట్ లాంటి నిర్మాణం చేపట్టామన్నారు. ఆ జలాలపై ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశామన్నారు.