మొదటిసారి ఓటు వేస్తున్న వారికి శుభాకాంక్షలు: మోడీ

మొదటిసారి ఓటు వేస్తున్న వారికి శుభాకాంక్షలు: మోడీ

గుజరాత్ అసెంబ్లీకి మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలి వస్తున్నారు. యువత కూడా ఓటు హక్కును వినియోగించేందుకు వస్తున్నారు. కొన్ని పోలింగ్ సెంటర్లలలో ఇప్పటికే ఓటర్లు భారీగా తరలి వచ్చి క్యూలో పడిగాపులు పడుతున్నారు. కాగా, మొదటిసారి ఓటు వేస్తున్న వారికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 2 కోట్ల 39 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 14వేల 382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 5న రెండో విడత పోలింగ్ జరగనుంది.

మరో వైపు గుజరాత్ మొదటి విడత పోలింగ్ లో పలువురు నేతలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ కుటుంబ సభ్యులతో కలిసి నవ్సారి పోలింగ్ సెంటర్ లో ఓటు వేశారు. అలాగే క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జడేజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్ కోట్ లోని పోలింగ్ సెంటర్ లో ఆమె ఓటు వేశారు. జామ్ నగర్ నియోజకవర్గంలో రివాబా జడేజా పోటీ చేస్తున్నారు.